Suryapet: దసరాను ప్రశాంతంగా జరుపుకోండి: ఎస్పీ నరసింహ

Suryapet: దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ సూచించారు. జూదం, గొడవలకు దూరంగా ఉండాలని, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని కోరారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 18 Oct 2026 8:39 PM IST
Suryapet
X

Suryapet: దసరాను ప్రశాంతంగా జరుపుకోండి: ఎస్పీ నరసింహ

సూర్యాపేట: దసరా పండుగను ప్రజలందరూ సంతోషంగా, ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ సూచించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఎస్పీ మాట్లాడుతూ... పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.

పండుగ వేళ ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని, ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. బెట్టింగులు, జూదం, గొడవలు, తగాదాలకు దూరంగా ఉండి పండుగలను సంప్రదాయబద్ధంగా, సోదరభావంతో జరుపుకోవాలని సూచించారు.

దసరా సెలవుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించే వారు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి వెళ్లేవారు విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇంటి భద్రత కోసం సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

పండుగ కోసం స్వగ్రామాలకు వచ్చే యువత గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని, పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, ప్రమాదకర ప్రాంతాల్లో ఆడుకోకుండా చూడాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అత్యవసర సంప్రదింపు: డయల్ 112, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 8712686026, 8712686057

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA