Suryapet: 62వ రోజుకు చేరిన సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ సాధన రిలే దీక్ష!
Suryapet: సూర్యాపేటలో జాతీయ రహదారి 65 సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ రూటు సాధన కోసం చేపట్టిన రిలే దీక్షలు 62వ రోజుకు చేరాయి.
Suryapet: 62వ రోజుకు చేరిన సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ సాధన రిలే దీక్ష!
Suryapet: జాతీయ రహదారి 65 సమాంతరంగా సూర్యాపేట మీదుగా మంజూరైన బుల్లెట్ ట్రైన్ రూటును మార్చడాన్ని నిరసిస్తూ చేపట్టిన బుల్లెట్ ట్రైన్ సాధన రిలే నిరాహార దీక్ష 62వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా బుధవారం మహిళా జేఏసీ ఆధ్వర్యంలో సదలచెరువు ట్యాంక్ బండ్ వద్ద భారీ బతుకమ్మ ఆటపాట వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను నిరసన వేదికగా మార్చిన మహిళలు, బుల్లెట్ ట్రైన్ రాకుండా అడ్డుకుంటున్న పాలకుల కుట్రలను ఎండగడుతూ పాటలు పాడారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసి పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు.
బతుకమ్మ ఆటలను ట్యాంక్ బండ్ పై వాకింగ్ కు వచ్చిన వందలాది మంది తిలకించారు. బుల్లెట్ ట్రైన్ ను పక్కదోవ పట్టిస్తున్న పాలకులపై ఉద్యమాన్ని కొనసాగించాలని మహిళలు ముక్తకంఠంతో నినాదాలు చేశారు. ఐదవ రోజు బతుకమ్మ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య మహిళలు కూడా బతుకమ్మలతో వచ్చి వేడుకల్లో పాల్గొనడంతో ట్యాంక్ బండ్ బుల్లెట్ ట్రైన్ నినాదాలతో హోరెత్తింది. అనంతరం బతుకమ్మలను గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసి గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, మహిళా జేఏసీ కన్వీనర్ వెలుగు వనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ఐద్వా నుండి మద్దెల జ్యోతి, మేకనబోయిన సైదమ్మ, ఏకలక్ష్మి, మారసాని చంద్రకళ, సూరం రేణుక, కట్ట కల్పన, ఐతరాజు పద్మ, భీమనపల్లి పద్మ, కొప్పోజు పద్మ, గుండగాని రేణుక, బీజేపీ మహిళా మోర్చా యర్కచర్ల శోభారాణి, మమత తదితరులు పాల్గొన్నారు.




