Suryapet: రాజ్యాంగ పరిరక్షణకు బీజేపీ కృషి.. 2047 నాటికి వికసిత్ భారత్: శ్రీలత

Suryapet: సూర్యాపేటలో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ చైతన్య ర్యాలీలో జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి పాల్గొని కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 27 Nov 2026 11:04 AM IST
Suryapet
X

Suryapet: రాజ్యాంగ పరిరక్షణకు బీజేపీ కృషి.. 2047 నాటికి వికసిత్ భారత్: శ్రీలత

Suryapet: రాజ్యాంగ పరిరక్షణకు బీజేపీ కృషి చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి అన్నారు.రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు బొజ్జ పరశురాం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రాజ్యాంగ చైతన్య ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ నగర్ దళిత వాడ నుంచి ఖమ్మం క్రాస్ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ర్యాలీని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన 2015 నుంచి కుల, మత భేదాలకు అతీతంగా యువతకు, దేశ ప్రజలకు రాజ్యాంగంపై అవగాహన కలిగేలా, రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా దేశవ్యాప్తంగా చైతన్య యాత్రను చేపట్టడం జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన అతి పెద్ద లిఖిత, సుదీర్ఘమైన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమన్నారు.రాజ్యాంగ హక్కులను కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు కాలరాస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ 1975లో దేశంలో ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను హరించే విధంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు.

రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ కులమతాలకు అతీతంగా ఆర్టికల్ 326 ప్రకారం ఓటు హక్కు, జీవించే హక్కు, ప్రాథమిక హక్కులు కల్పించిందని తెలిపారు. పార్లమెంటరీ విధానానికి వ్యతిరేకంగా ఉన్న నక్సలిజాన్ని దేశవ్యాప్తంగా అంతమొందించిన ఘనత మోదీకే దక్కిందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి లేకుండా 370 ఆర్టికల్‌ను కూడా రద్దు చేశారని గుర్తు చేశారు.

2014 నుంచి రాజ్యాంగ పరిరక్షణకు, దేశ సమగ్రతకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తూ 2047 వికసిత్ భారత్ దిశగా మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. మహిళా సాధికారత నెరవేరేలా మహిళా బిల్లును కేంద్రం తీసుకొస్తే బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం శోచనీయమన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగేలా అంత్యోదయ పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. డ్రగ్స్ మహమ్మారికి యువత బానిస కాకుండా ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని మెరుగైన సమాజం కొరకు పాటుపడాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి చల్లమల్ల నరసింహ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గుణగంటి పృథ్వి, జిల్లా సెక్రెటరీ రవివర్మ, బాలాజీ నాయక్, దాసరి వెంకన్న, రామచందర్, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కాంపాటి రాజు, చింత్రియాల సురేందర్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మీసాల మార్కండేయ, చందు, వెంకటయ్య, జానకి రాములు, శివ, అవిరెండ్ల వెంకటయ్య, ప్రేమ్ కుమార్, మురారి, రోహిత్, కోడి లింగయ్య, తన్నీరు వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA