Suryapet: ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: సూర్యాపేట కలెక్టర్

Suryapet: సూర్యాపేట కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హాజరై నిమజ్జన భద్రత, ఎల్ నినో సంసిద్ధతపై మాట్లాడారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 16 Oct 2026 10:48 PM IST
Suryapet
X

Suryapet: ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: సూర్యాపేట కలెక్టర్

సూర్యాపేట: సాంస్కృతిక వారసత్వానికి, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.

బతుకమ్మ సంబరాల్లో భాగంగా శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

మహిళలందరూ సమిష్టిగా చేరి బతుకమ్మ ఆడటం వల్ల సమాజంలో సాంఘిక ఐక్యత బలపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రకృతి ప్రసాదించిన తంగేడు, గునుగు, బంతి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ఆటపాటలతో వేడుకలు జరుపుకోవడం కన్నుల పండుగగా ఉందన్నారు. కలెక్టరేట్ మహిళా అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు.

నిమజ్జన ప్రాంతాల్లో జాగ్రత్తలు: బతుకమ్మ నిమజ్జన సమయంలో చెరువులు, కుంటల వద్ద మహిళలు తగిన జాగ్రత్తలు వహించాలని, జిల్లా వ్యాప్తంగా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

ఎల్ నినో ఎదుర్కొనేందుకు సిద్ధం: పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం ఎదురయ్యే అవకాశం ఉన్నందున దానిని ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్వో ప్రేమ్ రాజ్, జడ్పీ సీఈవో శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, జీఎం భారతి, డీఈఓ సులోచన రాణి, డీఎస్సీడీఓ లత, డీఎంహెచ్ఓ వెంకటరమణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష తదితరులు, మహిళా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA