Nalgonda: వివాహితపై అత్యాచార కేసులో నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష!
Nalgonda: నల్లగొండ జిల్లా వాడపల్లిలో వివాహిత అపహరణ, అత్యాచారం, దోపిడీ కేసులో నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష. వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్.
Nalgonda: వివాహితపై అత్యాచార కేసులో నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష!
Nalgonda: మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు. నేరస్తులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితను అపహరించి, బెదిరించి అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమె వద్ద ఉన్న ఆభరణాలను దోపిడీ చేసిన కేసులో నిందితుడికి నల్లగొండ మహిళా కోర్టు కమ్ IV అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి గారు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
వాడపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 78/2019, సెషన్స్ కేసు నంబర్ 147/2025కు సంబంధించిన ఈ కేసులో నిందితుడు బానోత్ శ్రీను అలియాస్ చిన్నా (35) టాటా ఏస్ వాహనంలో భార్యాభర్తలను ఎక్కించుకొని వారి గమ్యస్థానానికి తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. వారు దిగాల్సిన ప్రదేశం రాగానే భర్త వాహనం నుంచి దిగిన వెంటనే నిందితుడు వాహనం డోర్ మూసివేసి, వివాహితను బలవంతంగా తనతో పాటు తీసుకెళ్లి అపహరించాడు. అనంతరం ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడటంతో పాటు, ఆమె వద్ద ఉన్న ఆభరణాలను దోపిడీ చేసి, మార్గమధ్యలో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి దర్యాప్తు అధికారి, వాడపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె. నరసింహారావు, మిర్యాలగూడ రూరల్ సర్కిల్ అప్పటి సీఐ ఏ. రమేష్ బాబు కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి, న్యాయస్థానంలో నేరం నిరూపణకు అవసరమైన ఆధారాలను సమర్పించడంలో కీలక పాత్ర పోషించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి ఆర్. అఖిల ప్రాసిక్యూషన్ తరఫున న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.
కేసు విచారణ అనంతరం గౌరవ న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 366 కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా, సెక్షన్ 376 కింద పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా, సెక్షన్ 392 కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో సంబంధిత ఉత్తర్వుల ప్రకారం అదనపు సాధారణ కారాగార శిక్షను కూడా విధించింది. మొత్తం జైలు శిక్ష 20 సంవత్సరాలు కాగా, మొత్తం జరిమానా రూ.20,000.
మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏదైనా నేరం లేదా వేధింపుల ఘటన ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.
ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టి నేరస్తుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి దర్యాప్తు అధికారి, వాడపల్లి ఎస్ఐ కె. నరసింహారావు, మిర్యాలగూడ రూరల్ సర్కిల్ అప్పటి సీఐ ఏ. రమేష్ బాబు, ప్రాసిక్యూషన్ తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి ఆర్. అఖిలతో పాటు, కోర్టు డ్యూటీ విధుల నిర్వహణలో సమన్వయం చేసిన వాడపల్లి ప్రస్తుత ఎస్ఐ డి. సైదులు, మిర్యాలగూడ రూరల్ ప్రస్తుత సీఐ పి.ఎన్.డి. ప్రసాద్, మిర్యాలగూడ డీఎస్పీ జి. రవి, డి.సి.ఆర్.బి సీఐ శ్రీను నాయక్,కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఎండీ అద్నాన్ అహ్మద్, లైజన్ అధికారులు హెడ్ కానిస్టేబుల్ పి. నరేందర్, కానిస్టేబుల్ ఎన్. మల్లికార్జున్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అభినందించారు.




