Heroine: నాకు పిల్లలు కనడం ఇష్టం లేదు.. తెలుగు హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

Heroine: తమకు పిల్లలు వద్దు అంటూ నటి వరలక్ష్మి శరత్‌‌కుమార్ చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Gagan kumar
Published on: 3 Oct 2026 1:02 PM IST
Heroine
X

Heroine: నాకు పిల్లలు కనడం ఇష్టం లేదు.. తెలుగు హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

Heroine: వెండితెరపై ప్రతినాయక పాత్రలతోనూ, పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ రోల్స్‌తోనూ ప్రేక్షకులను మెప్పించే ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కేవలం సినిమాల పరంగానే కాకుండా, తన వ్యక్తిగత విషయాల్లోనూ ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సమాజంలో పెళ్లి కాగానే పిల్లలు కనడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంటుంది. అయితే, దీనిపై వరలక్ష్మి శరత్‌కుమార్ మాత్రం చాలా స్పష్టమైన, సాహసోపేతమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

2024లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలాయ్‌ సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్న వరలక్ష్మి... ఇటీవల వీజే భరణి సురేష్‌తో జరిగిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను బయటపెట్టారు. వ్యక్తిగతంగా నాకు పిల్లలు కనడం ఇష్టం లేదు. నేను కనలేనని కాదు.. నాకు పిల్లలు వద్దు. ఇది చాలా స్పష్టమైన ఎంపిక. నా భర్తకు కూడా పిల్లలు వద్దు అని ఆమె కుండబద్దలు కొట్టేశారు. తన భర్త నికోలాయ్‌కి గత వివాహం ద్వారా ఇప్పటికే ఒక కుమార్తె ఉందని, ఆమెను తాను ఎప్పుడూ తన సొంత కూతురిలాగే చూసుకుంటానని వరలక్ష్మి తెలిపారు. అంతేకాదు, తమ ఇంట్లో ఉన్న రెండు పెంపుడు కుక్కలను కూడా పిల్లల మాదిరిగానే ఎంతో ప్రేమగా చూసుకుంటామని పేర్కొన్నారు. పేరెంటింగ్‌ అనేది ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయం. మీరు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా లేకపోతే పిల్లలను కనకండి. పిల్లలు వద్దనుకోవడం చాలా మంచి పేరెంటింగ్‌ నిర్ణయం అని నేను నమ్ముతున్నాను" అని ఆమె అభిప్రాయపడ్డారు.

వరలక్ష్మి తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రముఖ సైకోథెరపిస్ట్, రిలేషన్‌షిప్‌ కోచ్‌ డెల్నా రాజేష్* సైతం స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. తరతరాలుగా సమాజంలో ఒక మూస పద్ధతి కొనసాగుతోందని... పెళ్లయిన వెంటనే పిల్లలు కనడం సహజమైన తదుపరి దశగా అందరూ భావిస్తారని ఆమె అన్నారు. కానీ, పిల్లలు కావాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛ అని స్పష్టం చేశారు. ఒక బిడ్డను పెంచడం అంటే కేవలం ఆర్థిక అవసరాలు తీర్చడం మాత్రమే కాదని, దానికి సమయం, సహనం, భావోద్వేగ స్థిరత్వం ఎంతో అవసరమని తెలిపారు. సమాజం ఒత్తిడి చేస్తోంది, తల్లిదండ్రులకు మనుమలు కావాలి అనే కారణాలతో పిల్లలను కనడం సరైన విధానం కాదు. కొందరు పిల్లలను కోరుకుంటారు, మరికొందరు కోరుకోరు. వారి వ్యక్తిగత నిర్ణయాలను సున్నితంగా అర్థం చేసుకోవాలి తప్ప విమర్శించకూడదు అని డెల్నా హితవు పలికారు.



Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.