Trivikram Srinivas: వెంకీ, త్రివిక్రమ్ కాంబోపై ట్రోల్స్ వర్షం..!
Trivikram Srinivas: విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47' చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
Trivikram Srinivas: వెంకీ, త్రివిక్రమ్ కాంబోపై ట్రోల్స్ వర్షం..!
Trivikram Srinivas: టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్‌గా బరిలోకి దిగిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలోని తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ (AK47) బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి అప్పరెంట్ క్లాసిక్స్ అందించిన ఈ క్రేజీ జోడీ నుంచి సినిమా రానుంద అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.
సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్ట్‌పై మీమ్స్, నెగెటివ్ ట్రోల్స్ వరదలా వచ్చిపడుతున్నాయి. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథనం, తమన్ అందించిన సంగీతమే టార్గెట్‌గా నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో పాటు, తమిళ చిత్రం ‘బ్లాస్ట్’, తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన ‘దృశ్యం’ ఛాయలను కలిపి ఈ కథను అల్లారంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
పాత సినిమాల్లో కనిపించిన త్రివిక్రమ్ మార్క్ పదునైన సంభాషణలు, సహజమైన హాస్యం ఇందులో లేవని, ఆయన పాత మూస పద్ధతిలోనే సినిమాను లాగించేశారంటూ మండిపడుతున్నారు. ఫస్టాఫ్ కాస్త నవ్వించినప్పటికీ, సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే నెమ్మదించిందని, క్లైమాక్స్‌ను హడావుడిగా చుట్టేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "మడతపెట్టాల్సింది కుర్చీని కాదు గురూజీని", "త్రివిక్రమ్‌లో అసలు సరుకు అయిపోయింది" అంటూ ఎక్స్ వేదికగా నెటిజన్లు ఘాటు కామెంట్లు పెడుతున్నారు.
త్రివిక్రమ్‌తో పాటు ఈ సినిమాకు పనిచేసిన సంగీత దర్శకుడు తమన్ కూడా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేదని, రొటీన్ డప్పుల చప్పుడు తప్ప కొత్తదనం లేదని ఆరోపిస్తున్నారు. థియేటర్‌లో చూస్తున్నంతసేపు సౌండ్ పొల్యూషన్ లాగా చికాకు కలిగిస్తోందని, తమన్ ఇకనైనా పాత ట్యూన్లే రుద్దడం ఆపాలని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమా ప్రచార సమయంలోనూ ట్రోల్స్‌కు సంబంధించిన చర్చ నడిచింది. సోషల్ మీడియా ప్రభావం వల్లనే చిత్రాన్ని కొన్ని వారాల పాటు వాయిదా వేయాల్సి వచ్చిందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వయంగా ప్రస్తావించారు. కుటుంబ ప్రేక్షకులను అలరించే కొన్ని నవ్వుల సన్నివేశాలు సినిమాలో ఉన్నప్పటికీ, అవి పూర్తిస్థాయిలో సినిమాను గట్టెక్కించగలవా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
వీకెండ్ వరకు వెంకీ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌తో నెట్టుకొచ్చినా.. సోమవారం నుంచి వర్కింగ్ డేస్‌లో ఈ నెగెటివిటీని తట్టుకుని సినిమా నిలబడటం పెను సవాలేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, సినిమా ట్రోల్ చేసేంత దారుణంగా ఏమీ లేదని, కొందరు కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని వెంకీ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమా ఫలితం హాట్ టాపిక్‌గా మారింది.




