Ramayana: ‘బాహుబలి 2’ లైఫ్‌టైమ్ రికార్డు బ్రేక్ చేసిన ‘రామాయణం’!
Ramayana: దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.
Ramayana: ‘బాహుబలి 2’ లైఫ్‌టైమ్ రికార్డు బ్రేక్ చేసిన ‘రామాయణం’!
Ramayana Box Office: భారతీయ సినీ చరిత్రలో బాక్సాఫీస్ రికార్డుల లెక్కలు మారుతున్నాయి. దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘రామాయణ: పార్ట్ 1’ థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తూ సరికొత్త చరిత్ర లిఖించింది.
నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ పౌరాణిక దృశ్యకావ్యం, తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ లైఫ్‌టైమ్ కలెక్షన్ల రికార్డును అధిగమించి సంచలనం రేపింది. 2017లో ‘బాహుబలి 2’ నెలకొల్పిన రూ.1,788.06 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ రికార్డును, ‘రామాయణ’ కేవలం 23 రోజుల్లోనే రూ.1,790.10 కోట్లు రాబట్టి తిరగరాసింది.
ఈ అరుదైన మైలురాయితో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా ‘రామాయణ’ నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాలో ‘దంగల్’ (రూ.2,070.30 కోట్లు), ‘ధురంధర్ 2’ (రూ.1,852.44 కోట్లు) మాత్రమే దీనికంటే ముందున్నాయి. దేశీయ మార్కెట్ పరంగా చూస్తే ‘బాహుబలి 2’ రూ.1,416.90 కోట్ల గ్రాస్ (రూ.1,030.42 కోట్ల నెట్)తో ఇప్పటికీ ఆధిక్యంలోనే కొనసాగుతోంది.
‘రామాయణ’ 23 రోజుల్లో ఇండియాలో రూ.1,195.10 కోట్ల గ్రాస్ (రూ.1,000.55 కోట్ల నెట్) వసూలు చేసింది. అయితే విదేశీ మార్కెట్లలో, ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం సాధించిన రూ.595 కోట్ల భారీ ఓవర్సీస్ గ్రాస్, ‘బాహుబలి 2’ (రూ.371.16 కోట్లు) రికార్డును దాటడానికి ప్రధాన బలంగా నిలిచింది. అంతేకాకుండా కేరళ బాక్సాఫీస్ వద్ద సైతం ‘బాహుబలి 2’ కలెక్షన్లను దాటేసి, అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన రెండో నాన్-మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది.
నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ తమ అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
లక్ష్మణుడిగా రవి దూబే, కైకేయిగా లారా దత్తా, దశరథుడిగా అరుణ్ గోవిల్, కైకసిగా శోభన కీలక పాత్రల్లో మెప్పించగా, ఆంజనేయుడి పాత్రలో సన్నీ డియోల్ ఆకట్టుకున్నారు. రావణుడి నేపథ్యంతో ప్రారంభమై, రాముడి బాల్యం, సీతా స్వయంవరం, అరణ్యవాసం, సీతాపహరణం వంటి ఘట్టాలతో ఉత్కంఠభరితంగా సాగుతూ యుద్ధానికి నాంది పలికే సన్నివేశంతో మొదటి భాగం ముగుస్తుంది.
ఆస్కార్ విజేతలు హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహ్మాన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం 99వ ఆస్కార్ అవార్డుల ఉత్తమ వీఎఫ్ఎక్స్ విభాగంలో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.
అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డుల పరంపర కొనసాగుతున్నప్పటికీ, భారీ బడ్జెట్ కారణంగా ఈ చిత్రం పూర్తి స్థాయిలో లాభాల బాట పట్టాలంటే థియేటర్లలో మరికొంత కాలం ఇదే జోరును కొనసాగించాల్సి ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




