Ramayana: ఇండియన్ సినిమా చరిత్రలోనే 'రామాయణ' అరుదైన రికార్డు..!
Ramayana: నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి నటించిన 'రామాయణ' (పార్ట్-1) కేవలం 6 రోజుల్లో రూ. 800 కోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
Ramayana: ఇండియన్ సినిమా చరిత్రలోనే 'రామాయణ' అరుదైన రికార్డు..!
Ramayana Part 1 box office collection: భారతీయ సినీ చరిత్రలో ఇప్పుడొక కొత్త అధ్యాయం లిఖించబడుతోంది. దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘రామాయణ’ (పార్ట్-1) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. నార్త్, సౌత్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా కలెక్షన్ల ర్యాంపేజ్ కొనసాగిస్తూ, విడుదలైన కేవలం 6 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ. 800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం రేపింది.
నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రామాయణ' తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని రూ. 155 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఆ తర్వాత వీకెండ్ మాత్రమే కాకుండా, వీక్ డేస్‌లోనూ ఏమాత్రం తగ్గకుండా ప్రతీ రోజూ రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొడుతోంది.
ఇలా వరుసగా 7 రోజుల పాటు ప్రతిరోజూ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన తొలి భారతీయ చిత్రంగా ‘రామాయణ’ చరిత్ర సృష్టించింది. గతంలో ‘పుష్ప 2’, ‘దురంధర్ 2’ చిత్రాలు వరుసగా 4 రోజుల పాటు ఈ ఘనత సాధించగా, ఇప్పుడు వాటి రికార్డులను ‘రామాయణ’ సునాయాసంగా దాటేసింది.
తెలుగు ప్రేక్షకులు ఈ ఇతిహాస గాథకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆరో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 5.44 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, 6 రోజుల్లో మొత్తం రూ. 53.22 కోట్ల గ్రాస్‌ను తన ఖాతాలో వేసుకుంది. నైజాం ఏరియాలో రూ. 33.34 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 19.88 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుత జోరు చూస్తుంటే త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 75 కోట్లు, ఆపై రూ. 100 కోట్ల మైలురాయిని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటివరకు ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’, ‘పుష్ప’ వంటి దక్షిణాది చిత్రాలు ఉత్తరాది బాక్సాఫీస్‌ను షేక్ చేయడం చూశాం. కానీ ఇప్పుడు ఒక హిందీ చిత్రం సౌత్‌లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దక్షిణాది భాషల్లో రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగా ‘రామాయణ’ అరుదైన రికార్డు నెలకొల్పింది.
తెలుగు: రూ. 53.22 కోట్లు
కన్నడ: రూ. 41.2 కోట్లు
మలయాళం: రూ. 12.9 కోట్లు
గతంలో సౌత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో ఉన్న ‘వార్ 2’ , ‘జవాన్’ (రూ. 57.94 కోట్లు), ‘యానిమల్’ (రూ. 50.89 కోట్లు) రికార్డులను 'రామాయణ' దాటేసి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇదే ఊపు కొనసాగితే దక్షిణాదిలోనే రూ. 200 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యశ్, సీతగా సాయి పల్లవి తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. వీరితో పాటు శోభన, లారా దత్తా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ అద్భుత దృశ్యకావ్యానికి కొనసాగింపుగా ‘రామాయణ పార్ట్-2’ 2028లో ప్రేక్షకుల ముందుకు రానుంది.




