Rajinikanth: రజనీకాంత్‌పై చంద్రబాబు ప్రభుత్వానికి అంత ప్రేమ ఎందుకో..?
Rajinikanth: రజనీకాంత్ 'జైలర్ 2' చిత్రానికి ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతివ్వడం వివాదాస్పదమైంది.
Rajinikanth: రజనీకాంత్‌పై చంద్రబాబు ప్రభుత్వానికి అంత ప్రేమ ఎందుకో..?
Jailer 2: తెలుగు సినీ పరిశ్రమలో టికెట్ ధరల వ్యవహారం మరోసారి వేడి పుట్టిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ వ్యయం పెరిగిపోతున్న తరుణంలో, ఆ పెట్టుబడులను రాబట్టుకునేందుకు ప్రత్యేక ధరల అనుమతులు పొందడం కొన్నాళ్లుగా మునుపెన్నడూ లేని విధంగా పరిపాటిగా మారింది. అయితే, సామాన్య ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించే విషయంలో నిర్మాతల మధ్య వ్యూహాత్మక విభేదాలు బయటపడుతుండటం ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. సినిమా కాన్వాస్ ఎంత పెద్దదైనా సరే, ప్రేక్షకుడి జేబుకు చిల్లు పడకూడదన్న ఉద్దేశంతో సాధారణ టికెట్ ధరలకే చిత్రాలను ప్రదర్శిస్తోంది.రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రానికి సాధారణ ధరల వ్యూహం అద్భుతమైన ఆదరణను తెచ్చిపెట్టింది.
రాబోయే 'రణబాలి' చిత్రానికి కూడా ఇదే రీతిలో అందుబాటు ధరల విధానాన్ని కొనసాగిస్తామని మైత్రీ ప్రకటించింది. మధ్యతరగతి కుటుంబాలను మళ్లీ థియేటర్ల బాట పట్టించాలంటే నామమాత్రపు ధరలే సరైన మార్గమని పరిశ్రమ వర్గాలు సైతం బలంగా నమ్ముతున్నాయి.
ఇలాంటి సానుకూల వాతావరణం నెలకొంటున్న సమయంలో, దసరా కానుకగా వస్తున్న రజనీకాంత్ 'జైలర్ 2' వ్యవహారం వివాదాస్పదమైంది. ఈ డబ్బింగ్ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్న ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ధరల పెంపును ఎంచుకోవడం విమర్శలకు దారితీసింది. అక్టోబర్ 15 నుంచి 21 వరకు వారం రోజుల పాటు రోజుకు 5 ప్రదర్శనలు, సింగిల్ స్క్రీన్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 75 వరకు అదనంగా పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పక్కనే ఉన్న తెలంగాణలో సాధారణ ధరలతోనే సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, ఏపీలో మాత్రం ఈ భారం ప్రేక్షకులపై పడటం గమనార్హం.
ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా వందల కోట్ల బడ్జెట్‌తో తీసే స్ట్రెయిట్ తెలుగు సినిమాల రిస్క్ తగ్గించడానికి ఇచ్చిన వెసులుబాటును పరాయి భాషా డబ్బింగ్ చిత్రాలకు వర్తింపజేయడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులోనే ప్రభుత్వం నిర్దేశించిన కఠినమైన ధరల పరిమితులు అమల్లో ఉంటే, ఇక్కడ తెలుగు అనువాదానికి ఈ రేట్లు పెంచడం న్యాయమా?. పోటీపడి భారీ రేట్లకు పంపిణీ హక్కులు కొనుగోలు చేసినప్పుడు, ఆ వ్యాపార నష్టభయాన్ని ప్రేక్షకులపై రుద్దడం సరికాదని నెటిజన్లు నిలదీస్తున్నారు. గతంలో 'వార్ 2' విషయంలోనూ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో భారీగా నష్టపోయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
‘జైలర్ 2’తో పాటు పోటీగా వస్తున్న ‘రణబాలి’ సాధారణ ధరలతోనే వస్తోంది. దీంతో సామాన్య ప్రేక్షకులు అందుబాటు ధరల్లో ఉన్న 'రణబాలి' వైపే మొగ్గుచూపితే, రేట్లు పెంచుకున్నందుకు ‘జైలర్ 2’తో నిర్మాత నాగవంశీ మళ్లీ భారీగా నష్టపోయే ప్రమాదముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వారం వారం ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన ధరలు నిర్ణయిస్తే, ఇప్పటికే ఓటీటీల దాడితో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న థియేటర్ వ్యవస్థకు దీర్ఘకాలంలో తీరని నష్టం జరుగుతుంది. డబ్బింగ్ సినిమాలకు టికెట్ రేట్ల పెంపు ఉండకూడదనే స్పష్టమైన నిబంధనలను ఫిలిం ఛాంబర్ తక్షణమే రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.




