Tollywood: 'మిమ్మల్ని గౌరవించిన ఇండస్ట్రీని గౌరవించండి'.. రాధికా ఆప్టేపై నిర్మాత SKN ఫైర్!

Tollywood: టాలీవుడ్‌పై రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలను నిర్మాత SKN తప్పుబట్టారు, ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ట్వీట్.

Ravi
By Ravi
Published on: 4 Nov 2026 5:03 PM IST
Tollywood
X

Tollywood: 'మిమ్మల్ని గౌరవించిన ఇండస్ట్రీని గౌరవించండి'.. రాధికా ఆప్టేపై నిర్మాత SKN ఫైర్!

Tollywood: టాలీవుడ్‌పై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలను నిర్మాత SKN తప్పుబట్టారు. ఇండస్ట్రీ ద్వారా అవకాశాలు, గుర్తింపు పొంది ఆ తర్వాత అదే ఇండస్ట్రీ సంస్కృతిని విమర్శించడం సరికాదన్నారు. 'అందరికీ అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. కానీ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. సౌత్ సినిమాల్లో చూపించే సంస్కృతి, సంప్రదాయాలు వేరే ప్రాంతం వారికి అసాధారణంగా అనిపించొచ్చు. కానీ పరస్పర గౌరవం ఉండాలి.' అని ట్వీట్ చేశారు.

రాధికా ఆప్టే కీర్తి సురేష్‌తో కలిసి నటించిన వెబ్ సిరీస్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన ఓ తెలుగు సినిమాలో సొంత మేనమామను పెళ్లి చేసుకునే పాత్ర పోషించాల్సి వచ్చిందని, ఆ సినిమాలోని ప్రతిదీ తనకు అసహ్యం కలిగించిందని చెప్పారు. అదే సినిమాలో వయసులో చాలా పెద్దవారైన నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని, అదంతా పితృస్వామ్య వాతావరణంలా అనిపించిందని అన్నారు. ఆ కథలో తన పాత్ర మధ్యలోనే చనిపోయిందని కూడా వివరించారు.

ఆ సమయంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ స్పందిస్తూ, తమిళ, తెలుగు ప్రాంతాల్లో మేనమామను పెళ్లి చేసుకోవడం సాంస్కృతిక సంప్రదాయమని చెప్పారు. రాధికా మాత్రం తన అభిప్రాయానికే కట్టుబడ్డారు.

రాధికా సినిమా పేరును, నటుడి పేరును వెల్లడించలేదు. అయితే సోషల్ మీడియా యూజర్లు బాలకృష్ణతో ఆమె నటించిన 'లెజెండ్' (2014), 'లయన్' (2015) సినిమాలను ప్రస్తావిస్తున్నారు. 2018లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా తాను చేసిన తెలుగు ప్రాజెక్టుల్లో లింగ సమానత్వం లేదని ఆమె చెప్పారు. అయితే అప్పుడు అందరినీ ఒకే గాటన కట్టడం ఇష్టం లేదని స్పష్టం చేశారు.

ఈ వివాదంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. SKN మాటలకు మద్దతుగా చాలామంది తెలుగు సినీ అభిమానులు నిలిచారు. సినిమా కథ, హీరో ఎవరో తెలిసే సంతకం చేసి, ఇప్పుడు విమర్శించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 'లెజెండ్' ద్వారా రాధికాకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చిందని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఆమె మాటల వెనుక ఉన్న సమస్యను చూడాలని, తెలుగు పరిశ్రమలో మహిళల భద్రత, సమానత్వంపై చాలాకాలంగా డిమాండ్లు ఉన్నాయని అంటున్నారు.

ప్రస్తుతం రాధికా ఆప్టే, కీర్తి సురేష్ కలిసి నటించిన నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ 'అక్క' ప్రమోషన్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు, SKN ప్రతిస్పందన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.