Chiranjeevi: నాతో సినిమా చేయమని నేను ఏ దర్శకుడినీ అడగలేదు!

Chiranjeevi: ‘ఇట్లు అర్జున’ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి తనదైన హాస్యంతో ఆకట్టుకున్నారు.

Gagan kumar
Published on: 18 Nov 2026 9:37 AM IST
Chiranjeevi
X

Chiranjeevi: నాతో సినిమా చేయమని నేను ఏ దర్శకుడినీ అడగలేదు!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ సందడి మామూలుగా ఉండదు. తనదైన శైలిలో వేసే పంచ్‌లు, సున్నితమైన హాస్యంతో ఆయన ఆడిటోరియాన్ని నవ్వుల్లో ముంచెత్తుతారు. తాజాగా జరిగిన ‘ఇట్లు అర్జున’ సక్సెస్ మీట్‌లోనూ చిరు తన మార్క్ కామెడీ టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వేదికపై దర్శకుడు వెంకీ కుడుములపై సరదాగా అలుగుతూనే, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

దర్శకుడు వెంకీ కుడుముల కామెడీ టైమింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చిరంజీవి మనసులోని మాటను బయటపెట్టారు. ఇప్పటివరకు నాతో సినిమా చేయమని నేను ఏ దర్శకుడినీ అడగలేదు. కానీ, మొదటిసారి వెంకీ కుడుములను మాత్రం నాతో ఓ సినిమా చేయమని స్వయంగా అడిగాను అంటూ చిరు అసలు విషయాన్ని చెప్పారు.

మంచి కథతో వస్తానని మాట ఇచ్చిన వెంకీ ఇప్పటివరకు రాలేదు. పైగా ఇప్పుడు ఏకంగా నిర్మాత అవతారం ఎత్తాడు. పోనీ నిర్మాతగానైనా నాతో సినిమా చేస్తాడా అంటే.. అదీ లేదు, యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. అందుకే ఇకపై వెంకీ వచ్చినా నా ఇంటి గేట్లు మూసి ఉంటాయి అంటూ చిరంజీవి నవ్వుతూ అనడంతో సభా ప్రాంగణం ఒక్కసారిగా నవ్వులతో మార్మోగింది.

ఇదే వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఉత్సాహంపైనా చిరు సరదాగా స్పందించారు. తమన్ ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా మా ‘కాక’ సినిమా గురించే తెగ మాట్లాడేస్తున్నాడు. కాస్త పబ్లిసిటీ తగ్గిస్తే మంచిది. లేదంటే మిగతా సినిమాల వాళ్లు తమ సినిమా గురించి తమన్ ఏమీ చెప్పడం లేదని ఫీల్ అవుతారు అంటూ చురకలంటించారు. అయితే వెంటనే అసలు విషయం చెబుతూ.. తమన్ చెబుతున్నది అక్షరాలా నిజం. ‘కాక’ సినిమాతో ఈసారి కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు.

‘ఇట్లు అర్జున’ చిత్రానికి ఇంతమంది ప్రముఖుల మద్దతు లభించడం హీరో అనీష్ చేసుకున్న అదృష్టమని చిరు ప్రశంసించారు. అనీష్‌కు ఇంతటి సపోర్ట్ దక్కడానికి ప్రధాన కారణం ఆయన తండ్రి ఏఎంఆర్ మహేశ్ రెడ్డి అని కొనియాడారు.

మహేశ్ రెడ్డి బయట ఎంత పెద్ద మైనింగ్ డాన్ అయినప్పటికీ, సినిమా పట్ల ఆయనకున్న అమితమైన ప్రేమ, ఆసక్తి వల్లే ఈరోజు ఇంతమంది అనీష్‌కు అండగా నిలిచారు అని చిరంజీవి పేర్కొన్నారు. మొత్తానికి ‘ఇట్లు అర్జున’ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు, సినిమా విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.