Keerthy Suresh: విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో!

Keerthy Suresh: తన భర్త ఆంటోనీతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ తాగుబోతు ప్రయాణికుడి వల్ల ఎదురైన చేదు అనుభవాన్ని హీరోయిన్ కీర్తి సురేష్ బయటపెట్టారు.

Gagan kumar
Published on: 30 Oct 2026 3:42 PM IST
Keerthy Suresh
X

Keerthy Suresh: విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో!

Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోవడమే కాకుండా, ‘అక్క’ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె, తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. సెలబ్రిటీల జీవితాలు పైకి ఎంత గ్లామరస్‌గా కనిపిస్తాయో.. ఒక్కోసారి వారి వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంత భంగం వాటిల్లుతుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. తన భర్త ఆంటోనితో కలిసి మిలాన్ నుంచి భారత్‌కు వస్తున్న సమయంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని కీర్తి సురేష్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

విమాన ప్రయాణంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో సరిగా నిలబడలేని స్థితిలో తన దగ్గరకు వచ్చాడని, వెంటనే సెల్ఫీ కావాలంటూ పదేపదే ఒత్తిడి చేశాడని ఆమె తెలిపారు.ప్రయాణంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో.. దయచేసి కొంచెం వేచి ఉండండి అని తాను, తన భర్త ఆంటోని వారించినప్పటికీ ఆ వ్యక్తి వినలేదని, ఇప్పుడే ఫొటో కావాలంటూ మరింత పట్టుబట్టాడని కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు.నేను ఎప్పుడు ఫొటో దిగాలన్నది మీరే నిర్ణయించలేరు అని తాను స్పష్టంగా చెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని, చివరికి భర్త ఆంటోని కూడా వారించే ప్రయత్నం విఫలమవడంతో విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చిందని వివరించారు.

అభిమానులు తనను ఆప్యాయంగా పలకరించడం, ఫొటోలు దిగడం తనకు ఎప్పుడూ ఇష్టమేనని కీర్తి స్పష్టం చేశారు. అయితే, అభిమానం అనే ముసుగులో ఎదుటివారి వ్యక్తిగత స్వేచ్ఛను, ఇబ్బందులను పట్టించుకోకుండా ప్రవర్తించడం సరైంది కాదని హితవు పలికారు. సెల్ఫీ అడగకుండానే తమను ఎంతో గౌరవంగా పలకరించి, సరదాగా మాట్లాడి వెళ్లే ఎంతోమంది నిజమైన అభిమానుల తీరు తనకెంతో సంతోషాన్నిస్తుందని ఆమె పేర్కొన్నారు.

వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నా, ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రం కీర్తి సురేష్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. రాధిక ఆప్టెతో కలిసి నటించిన ‘అక్క’ వెబ్ సిరీస్ ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.టాలీవుడ్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌కు జోడీగా ‘జనవరి 12 విడుదల’ చిత్రంలో నటిస్తున్నారు.విజయ్ దేవరకొండ సరసన పాన్ ఇండియా సినిమా ‘రౌడీ జనార్ధన’తో పాటు ‘సత్యన్ సావిత్రి’, ‘కన్నెవీడి’, ‘తొట్టం’, ‘రాఫ్తార్’ వంటి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా ఒక సాధారణ మహిళగా తాను ఎదుర్కొన్న ఈ అనుభవాన్ని ధైర్యంగా బయటపెట్టడం పట్ల నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. సెలబ్రిటీల ప్రైవసీని కూడా గౌరవించాలనే సందేశాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.