Dhanush: బీజేపీలోకి ధనుష్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చేసిన హీరో
Dhanush: ధనుష్ కొత్త రాజకీయ పార్టీ 'తమిళగ ఎళుచ్చి కళగం' ప్రచారంపై స్పందన.
Dhanush: బీజేపీలోకి ధనుష్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చేసిన హీరో
Dhanush Political Entry: తమిళ సినీ రంగానికి, రాజకీయాలకు ఎప్పటినుంచో విడదీయరాని అనుబంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ నుంచి కమల్ హాసన్, దళపతి విజయ్ వరకు కోలీవుడ్ స్టార్స్ పొలిటికల్ ఎంట్రీలతో తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటాయి. ఇప్పుడు అదే బాటలో వర్సటైల్ యాక్టర్ ధనుష్ అడుగులు వేస్తున్నారనే ప్రచారం ద్రవిడ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో ధనుష్ ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పేరును కూడా నమోదు చేయించారని సోషల్ మీడియాలో కథనాలు షికారు చేశాయి.
ధనుష్ పొలిటికల్ రీ-ఎంట్రీపై మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా నడిచింది. ఆయన వెనుకుండి నడిపిస్తున్నది జాతీయ పార్టీ అయిన బీజేపీయేనని, ఆ పార్టీ మద్దతుతోనే ధనుష్ తమిళనాడులో పాగా వేయాలని చూస్తున్నారంటూ విమర్శకులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా తన తాజా చిత్రం ‘ఓమ్’ ఆడియో లాంచ్ వేదికగా పాల్గొన్న ధనుష్ ఈ వివాదాలు, పొలిటికల్ రూమర్లపై అత్యంత హుందాగా, మాస్ డైలాగ్‌తో స్పందించారు.
ఈ మధ్య నా గురించి, నా వెనుక ఎవరున్నారు అనే దానిపై ఎన్నో వార్తలు, పుకార్లు వస్తున్నాయి. ఫలానా వాళ్లు నాకు మద్దతు ఇస్తున్నారు, ఇంకొకరు నన్ను నడిపిస్తున్నారు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక్కటే స్పష్టంగా చెబుతున్నాను.. నన్ను నడిపిస్తున్నది ఆ దేవుడు! నా వెనుక కొండంత బలంగా నిలబడింది నా అభిమానులు. నా పక్కన అండగా నిలిచింది ఈ ప్రజలు.
తన వెనుక ఏ రాజకీయ శక్తి లేదా ప్రత్యేక సంస్థ లేదని స్పష్టం చేయడం ద్వారా, బీజేపీ మద్దతుతోనే తాను వస్తున్నాననే విమర్శల నోళ్లను ధనుష్ ఒక్క మాటతో మూయించారు. ధనుష్ కేవలం స్టేట్మెంట్లకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ ప్రజలకు ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు, సామాజిక సమస్యలకు ఉచితంగా న్యాయ సలహాలు అందించేందుకు తమిళనాడు వ్యాప్తంగా 3,000 మంది న్యాయ సలహాదారులను నియమించాలని ధనుష్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల కష్టాల్లో నేరుగా పాలుపంచుకోవడమే ఆయన ప్లాన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానుల నర్పణి మన్రంను ఇప్పటికే బూత్ స్థాయిలో పటిష్టం చేసిన ధనుష్, ఇప్పుడు లీగల్ సెల్‌ను సిద్ధం చేయడం ఆయన పొలిటికల్ విజన్‌కు నిదర్శనం.
తెరపై జాతీయ అవార్డు గ్రహీతగా తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ధనుష్.. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోనూ విజయం సాధిస్తారని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేకుండా, కేవలం ప్రజల మద్దతుతోనే బరిలోకి దిగుతానని సంకేతాలివ్వడం తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీస్తోంది.
ముందుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ధనుష్ తన పావులు కదుపుతున్నట్లు సమాచారం. సినిమా రంగంలో సరికొత్త శకానికి నాంది పలికిన ధనుష్, రాబోయే రోజుల్లో ద్రవిడ రాజకీయాల్లో ఏ స్థాయి సంచలనం సృష్టిస్తారో వేచి చూడాల్సిందే.




