Cinema: సందడి అంతా డిసెంబర్‌లోనే! డిసెంబర్ 24న నాగార్జున, బాలకృష్ణ, షారుక్ ఢీ..!

Cinema: నవంబర్‌లో రామాయణతో పాటు ధనుష్ 'ఓం' తప్ప పెద్ద సినిమాలు లేకపోయినా, డిసెంబర్‌లో నాగార్జున 'కింగ్ 100', బాలకృష్ణ 'దాదా', నాగచైతన్య 'వృషకర్మ', షారుక్ 'కింగ్', హాలీవుడ్ నుంచి 'అవెంజర్స్: డూమ్స్ డే', 'డ్యూన్-3', 'జుమాంజీ' సినిమాలు రానున్నాయి.

Ravi
By Ravi
Published on: 13 Nov 2026 7:11 PM IST
Cinema
X

Cinema: సందడి అంతా డిసెంబర్‌లోనే! డిసెంబర్ 24న నాగార్జున, బాలకృష్ణ, షారుక్ ఢీ..!

Cinema: బాక్సాఫీసులో వచ్చేనెల పెద్ద సినిమాల హవా సాగనుంది. ఈనెలలో 'రామాయణ' సహా రిలీజ్‌కు రెడీగా ఉన్న ధనుష్ 'ఓం' తప్ప బిగ్ ఫిల్మ్స్ లేవు. కానీ డిసెంబర్‌లో తెలుగుతో పాటు హైబజ్ ఉన్న బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు రానున్నాయి. తెలుగులో నాగార్జున 'కింగ్100', 'దాదా', 'వృషకర్మ'.. బాలీవుడ్ నుంచి షారుక్ 'కింగ్', 'మాతృభూమి' ఉన్నాయి. హాలీవుడ్ నుంచి 'అవెంజర్స్ డూమ్స్ డే', 'డ్యూన్-3', 'జుమాంజీ ఓపెన్ వరల్డ్' సందడి చేయనున్నాయి.

తెలుగు సినిమాల్లో మొదట డిసెంబర్ 4న నాగచైతన్య 'వృషకర్మ' రానుంది. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. డిసెంబర్ 24న రెండు పెద్ద సినిమాలు ఢీకొంటున్నాయి. నాగార్జున వందో చిత్రం 'కింగ్ 100'కు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో టబు, అశోక్ సెల్వన్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. అదే రోజు బాలకృష్ణ 'దాదా' (NBK111) విడుదల కానుంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్.

బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ 'కింగ్' డిసెంబర్ 24న థియేటర్లలోకి వస్తోంది. మూడేళ్ల విరామం తర్వాత షారుక్ తిరిగి వెండితెరపై కనిపిస్తున్న సినిమా ఇది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కూతురు సుహానా ఖాన్ నటిస్తున్నారు. దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణీ ముఖర్జీ, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో ఉన్నారు. 'కింగ్' విడుదల వాయిదా పడుతుందనే ప్రచారం జరిగినా, డిసెంబర్ 24కే ఉంటుందని నిర్మాణ వర్గాలు చెప్పినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

హాలీవుడ్ నుంచి డిసెంబర్ 18న రెండు భారీ ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్‌గా తిరిగి వస్తున్న 'అవెంజర్స్: డూమ్స్ డే'ను రూసో బ్రదర్స్ తెరకెక్కించారు. డెనిస్ విల్‌నెవ్ దర్శకత్వంలో తిమోతీ చాలమెట్ నటించిన 'డ్యూన్: పార్ట్ త్రీ' అదే రోజు విడుదల అవుతోంది. తెలుగు డబ్బింగ్‌తో కూడా ఇవి థియేటర్లలోకి వస్తాయి. డిసెంబర్ 25న డ్వేన్ జాన్సన్, జాక్ బ్లాక్ నటించిన 'జుమాంజీ: ఓపెన్ వరల్డ్' సందడి చేయనుంది.

ఒకే వారంలో ఇన్ని భారీ సినిమాలు రావడంతో థియేటర్ల కేటాయింపు, వసూళ్ల పంపకంపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. డిసెంబర్ 24న నాగార్జున, బాలకృష్ణ, షారుక్ సినిమాలు ఒకేసారి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమాకు ఎక్కువ థియేటర్లు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకులకు డిసెంబర్ మొత్తం సినిమా పండగే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.