Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన షాలినికి బంపర్ ఆఫర్

Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆదివారం ఎపిసోడ్ భావోద్వేగాలు, సరదా టాస్కులు, ఊహించని ట్విస్ట్‌తో సాగింది.

CR Reddy
Published on: 19 Oct 2026 7:52 AM IST
Bigg Boss Telugu 10
X

Bigg Boss Telugu 10

Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆదివారం ఎపిసోడ్ భావోద్వేగాలు, సరదా టాస్కులు, ఊహించని ట్విస్ట్‌తో సాగింది. అక్టోబర్ 18న ప్రసారమైన ఎపిసోడ్‌లో ముందుగా సండే ఫండేలో భాగంగా డ్యాన్స్ ఫేస్ ఆఫ్ నిర్వహించారు. హౌస్‌మేట్స్ తమ డ్యాన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రామ్ ప్రసాద్ మార్కులు వేయగా, నాగార్జున కూడా తన మార్కులు ఇచ్చారు. ఈ పోటీలో నరేష్ టీమ్ విజయం సాధించింది. అమన్ తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. నీతూ, షాలిని డ్యాన్స్ చేసిన సమయంలో నాగార్జున రోహిత్ అభిప్రాయాన్ని అడగడంతో హౌస్‌లో సరదా వాతావరణం కనిపించింది.

రామ్ ప్రసాద్‌కు స్టార్ ప్లేయర్ గుర్తింపు

డ్యాన్స్ టాస్క్ తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల గురించి ఓజీ కంటెస్టెంట్లు తమ అభిప్రాయాలను చెప్పే టాస్క్ నిర్వహించారు. ఒక్కో కంటెస్టెంట్ మిర్చి ఇచ్చి తమకు నచ్చని ఆటగాడి పేరు చెప్పాల్సి వచ్చింది. ఈ సమయంలో చాలామంది దక్షి పేరును ప్రస్తావించారు. దీంతో ఆమెకు నాగార్జున పనిష్మెంట్ ప్రకటించారు. దక్షి వరుసగా రెండు వారాలు నామినేషన్లలో ఉండాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు, ఎక్కువ మంది ఓట్లతో రామ్ ప్రసాద్ స్టార్ ప్లేయర్‌గా నిలిచాడు. ఈ పరిణామాల తర్వాత ఎలిమినేషన్‌పై ఉత్కంఠ పెరిగింది.

షాలిని ఎలిమినేట్ అయినట్లు ప్రకటన

చివరికి నామినేషన్లలో రోహిత్, షాలిని, వర్షిణి ఉండగా.. ముందుగా రోహిత్ సేఫ్ అయ్యాడు. దీంతో షాలిని, వర్షిణి మధ్య పోటీ నెలకొంది. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన బాక్సుల దగ్గర ఇద్దరినీ నిలబెట్టి, నాగార్జున పేర్లు ప్రకటిస్తూ ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించారు. చివరికి షాలిని ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో ఆమె నిజంగానే ఇంటి నుంచి వెళ్లిపోతోందని హౌస్‌మేట్స్ భావించారు. తనకు ఏం జరగబోతోందో ముందే ఊహించిన షాలిని, రోహిత్‌ను కౌగిలించుకుని భావోద్వేగానికి గురైంది.

షాలిని కోసం వెక్కి వెక్కి ఏడ్చిన రోహిత్

షాలిని ఎలిమినేట్ అయిందని తెలియగానే రోహిత్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆమెను కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. రోహిత్‌ను ఓదార్చే ప్రయత్నం చేసిన షాలిని కూడా కన్నీళ్లు పెట్టుకుంది. తనను అందరూ ఎలా అనుకున్నా పర్వాలేదని, రోహిత్ ఒక్కరైనా తనను అర్థం చేసుకుంటే చాలని చెప్పింది. తాను తిరిగి రాకపోయినా ఆట కొనసాగించాలని, కప్పుతో తిరిగి రావాలని రోహిత్‌కు సూచించింది. స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత కూడా షాలిని, రోహిత్ గురించి భావోద్వేగంగా మాట్లాడింది. ఆమె ఏవీలో కూడా రోహిత్ ఎక్కువగా కనిపించడంతో నాగార్జున సరదాగా కౌంటర్లు వేశారు.

వంశీ, సుధీర్, వర్షిణిపై షాలిని కామెంట్స్

స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత తన స్థానంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన ముగ్గురి పేర్లు చెప్పాలని నాగార్జున షాలినిని అడిగారు. దీంతో ఆమె వంశీ, సుధీర్, వర్షిణి పేర్లను చెప్పింది. వంశీ త్రిగుణ్ మాట వింటాడని, సొంతంగా ఆడటం లేదని షాలిని అభిప్రాయపడింది. సుధీర్ కూడా ముకేశ్, వర్షిణి ప్రభావంలో ఉంటున్నాడని పేర్కొంది. వర్షిణి కంటే తాను గేమ్స్‌లో బలంగా ఆడతానని, కాబట్టి ఆమె ఎలిమినేట్ కావాల్సిందని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై నాగార్జున తనదైన శైలిలో స్పందిస్తూ షాలినిని ఆటపట్టించారు. షాలిని కూడా సరదాగా సమాధానమిచ్చింది.

సీక్రెట్ రూమ్‌కు షాలిని

హౌస్‌మేట్స్‌కు గుడ్‌బై చెప్పి వెళ్లిపోతున్న షాలినిని నాగార్జున మళ్లీ వెనక్కి పిలిచారు. ఆమె ఎలిమినేట్ కాలేదని, ప్రస్తుతం సీక్రెట్ రూమ్‌కు వెళ్లాల్సి ఉంటుందని వెల్లడించారు. దీంతో అప్పటివరకు బాధలో ఉన్న షాలిని ఒక్కసారిగా సంతోషంతో ఎగిరి గంతేసింది. ఆమెను ఎప్పుడు తిరిగి హౌస్‌లోకి పంపించాలనేది బిగ్‌బాస్ నిర్ణయిస్తారని నాగార్జున తెలిపారు. ఈ విషయం తెలియని హౌస్‌మేట్స్ మాత్రం షాలిని నిజంగానే ఎలిమినేట్ అయిందని భావిస్తున్నారు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న సమయంలో ఆమె ఏం గమనిస్తుంది? తిరిగి ఇంట్లోకి వచ్చిన తర్వాత తన ఆటను మార్చుకుంటుందా? రోహిత్‌తోనే ఎక్కువ సమయం గడుపుతుందా? అన్నది తర్వాతి ఎపిసోడ్‌లలో ఆసక్తికరంగా మారనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.