Bigg Boss 10: అపూర్వ వర్సెస్ హౌస్‌మేట్స్.. షాలిని రచ్చతో హీటెక్కిన హౌస్

Bigg Boss 10: బిగ్‌బాస్ సీజన్ 10 రేసు రోజురోజుకూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల హెచ్చరికలతో జంటలుగా విడిపోయిన కంటెస్టెంట్లు టాస్కులో హోరాహోరీగా తలపడ్డారు.

CR Reddy
Published on: 8 Oct 2026 8:22 AM IST
Bigg Boss 10
X

Bigg Boss 10

Bigg Boss 10: బిగ్‌బాస్ సీజన్ 10 రేసు రోజురోజుకూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అక్టోబరు 7న ప్రసారమైన 30వ రోజు ఎపిసోడ్‌లో అనూహ్య మలుపులు, సెంటిమెంట్ డ్రామాలు చోటుచేసుకున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీల హెచ్చరికలతో జంటలుగా విడిపోయిన కంటెస్టెంట్లు టాస్కులో హోరాహోరీగా తలపడ్డారు. ఒకవైపు వర్షిణి కన్నీటి గాధ, మరోవైపు అపూర్వను అందరూ టార్గెట్ చేయడం ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచాయి. నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన వెంటనే హౌస్‌లో పొలిటికల్ వ్యూహాలు మొదలయ్యాయి. తనను ఏ రకమైన కారణం లేకుండా నామినేట్ చేశారంటూ ఆడియన్స్ సపోర్ట్ కోరాడు నరేష్. తాము చూపించిన ఆటతీరు ముందూ వెనుకా ఆలోచించకుండా జరిగిందని రాంప్రసాద్ గ్యాంగ్ చర్చించుకుంది. రోహిత్, అమన్, ఝాన్సీ ఒకరినొకరు కలుపుకొని పోయేందుకు చూశారు. తమ గ్రూప్‌లోని మనుషులను వేరు చేసేందుకు ఆపోజిట్ టీమ్ గట్టి ప్రయత్నాలే చేస్తోందని అమన్ ఆరోపించగా, ఝాన్సీ మాత్రం సెలబ్రిటీల వైపే మొగ్గు చూపుతూ మాట్లాడటం వాతావరణాన్ని కాస్త వేడెక్కించింది.

తండ్రి ప్రేమ కోసం వర్షిణి కన్నీళ్లు

తమ ఇంట్లో నాన్న స్థానం ఎంత గొప్పదో త్రిగుణ్‌ దగ్గర చెప్తూ వర్షిణి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ముకేష్ తనకు ఇస్తున్న ధైర్యాన్ని, ఆత్మీయతను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఇది ఎలాంటి లవ్ ట్రాక్ కాదని, చిన్నప్పటి నుంచి తన తండ్రి నుంచి లభించని ఆసరాను ముకేష్ ఇస్తున్నాడని చెప్పడం అక్కడ ఉన్నవారిని కలచివేసింది. ఈ సెంటిమెంట్ ముగిసిన వెంటనే బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. త్వరలోనే కొత్త సభ్యులు రాబోతున్నారని, సేఫ్ జోన్‌లో ఉన్న నలుగురు తప్ప మిగిలిన వారంతా జంటలుగా మారి గేమ్ ఆడి తమ స్థానాన్ని కాపాడుకోవాలని ఆదేశించాడు.

రోహిత్ కోసం షాలిని రచ్చ

జంటల ఎంపిక సమయంలో రోహిత్‌తో కలిసి ఆడేందుకు షాలిని ఆసక్తి చూపగా, అపూర్వ కూడా అదే ఆశించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. గొడవ పెరగడంతో రోహిత్ షాలినిని అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. హౌస్‌లో ఏర్పడిన ఐదు జంటలకు స్టార్ స్టార్ సూపర్ స్టార్ అనే పజిల్ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఒకరు తాడును బ్యాలెన్స్ చేస్తూ పట్టుకుంటే, మరొకరు పజిల్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఆటలో అపూర్వ-చరణ్ జోడీ వేగంగా పజిల్ పూర్తి చేసి 100 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, రోహిత్ ఘోరంగా విఫలం కావడంతో షాలిని-రోహిత్ జోడీ చివరి స్థానానికి పరిమితమైంది.

హౌస్‌లో దారుణంగా ఒంటరైపోయిన అపూర్వ

టాస్క్ గెలిచినా కూడా అపూర్వకు హౌస్‌లో కష్టాలు తప్పలేదు. రెండు టీమ్‌ల సభ్యులు ఆమెను ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టడం మొదలుపెట్టారు. షాలిని అయితే రోహిత్‌పై ఒత్తిడి తెస్తూ అపూర్వను తమ గ్రూప్ నుంచి పూర్తిగా తొలగించాలని పట్టుబట్టింది. చరణ్ తప్ప హౌస్‌లో మిగతా 14 మంది ఆమెతో మాట్లాడకపోవడం ప్రేక్షకులకు కాస్త దారుణంగా అనిపించింది. అంత జరుగుతున్నా ఏడవకుండా, తన బాధను మనసులోనే అణచుకుంటూ అపూర్వ మౌనంగా ఉండిపోవడం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి నరేష్ తన గ్యాంగ్‌కు ఓ రాకుమారుడి కథ చెప్తూ ఎపిసోడ్‌ను ముగించాడు. రాబోయే రోజుల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తే హౌస్‌లో ఉన్న ఏ జంట బయటకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. నామినేషన్లు, టాస్కుల మంటలు రాబోయే ఎపిసోడ్లలో మరిన్ని వివాదాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.