Bigg Boss 10: త్రిగుణ్‌పై నాగార్జున ఫైర్.. నరేష్‌కు ఫ్యామిలీ వీక్ షాక్.. బిగ్ బాస్‌లో ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ 10 తెలుగు డే 62 ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్ల తప్పులపై ప్రశ్నలు సంధించారు. దేబ్జానీ, ముకేష్, నీతూ, వంశీ గొడవల వీడియోలు చూపించారు.

CR Reddy
Published on: 8 Nov 2026 7:37 AM IST
Bigg Boss 10 Telugu
X

Bigg Boss 10 Telugu

Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్‌లో శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కంటెస్టెంట్ల ప్రవర్తన, టాస్కుల్లో జరిగిన గొడవలు, ఒకరిపై మరొకరు చేసిన వ్యాఖ్యలపై నాగార్జున ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా దేబ్జానీ, ముకేష్, నీతూ, వంశీ, త్రిగుణ్‌లకు సంబంధించిన వీడియోలను చూపిస్తూ వారి తప్పులపై చర్చించారు. మరోవైపు నరేష్ తీసుకున్న నిర్ణయం అతని ఫ్యామిలీ వీక్ అవకాశాన్ని దూరం చేసింది. చివర్లో నామినేషన్లలో ఉన్న ఎనిమిది మందిలో అమన్‌కు ఊరట లభించింది.

కంటెస్టెంట్ల తప్పులపై నాగార్జున ప్రశ్నలు

ఎపిసోడ్ ప్రారంభంలో కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా పిలిచిన నాగార్జున.. వారి ఆటతీరుపై మాట్లాడారు. తప్పులు చేసినవారి కుండలను పగలగొడుతూ తమ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. సుధీర్‌కు బెటర్ కాదు.. బెస్ట్ ఇవ్వాలని చెబుతూ అతని కుండను పగలగొట్టారు. ఆ తర్వాత దేబ్జానీ వంతు వచ్చింది. ఆమె తన ఆటకు పది మార్కులకు ఎనిమిది ఇస్తానని చెప్పడంతో, గతంలో ముకేష్ గురించి చేసిన వ్యాఖ్యల వీడియోను నాగార్జున చూపించారు. ముకేష్‌ను ఉద్దేశించి దేబ్జానీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ప్రశ్నించారు. హౌస్‌లో ఆడ, మగ అనే తేడా పెట్టకుండా అందరూ సమానంగా ఆడాలని సూచించారు. అయితే తనపై పలువురు అబ్బాయిలు దాడి చేసిన సందర్భంలోనే అలా మాట్లాడానని దేబ్జానీ వివరణ ఇచ్చింది.

వర్షిణి, ముకేష్ వ్యవహారంపై హాట్ డిస్కషన్

ఆ తర్వాత వర్షిణి, ముకేష్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను నాగార్జున చూపించారు. వర్షిణి ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తూ.. ఆమె సరిగ్గా ఆడితే హౌస్‌లోని ఏ ప్లేయర్ అయినా ఆమె ముందు నిలవలేడని అన్నారు. మరోవైపు దేబ్జానీకి సంబంధించిన ఘటనలో ముకేష్ కాలితో తన్నిన దృశ్యాన్ని చూపించారు. దీనిపై వర్షిణిని అడగ్గా.. అతను దేబ్జానీని కాకుండా ఆమె బ్యాగ్‌ను తన్నేందుకు ప్రయత్నించాడని చెప్పింది. ముకేష్ కూడా తన చర్య తప్పేనని అంగీకరించాడు. అయితే దేబ్జానీని కావాలని తన్నలేదని వివరణ ఇచ్చాడు. నీతూ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయినప్పటికీ కోపంలో కాలు ఎత్తడం కూడా తప్పేనని నాగార్జున స్పష్టం చేశారు. అనంతరం నీతూ, వంశీ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలను చూపించారు. ఇద్దరూ ఒకరిపై మరొకరు భౌతికంగా దాడి చేసిన సందర్భంపై ప్రశ్నిస్తూ, సంచాలక్‌గా ఉన్న శివ్ బాధ్యతను కూడా గుర్తు చేశారు.

త్రిగుణ్ ప్రవర్తనపై నాగార్జున సీరియస్

ఎపిసోడ్‌లో ఎక్కువ చర్చకు కారణమైన అంశం త్రిగుణ్ వ్యవహారం. గతంలో ముకేష్ గురించి పాట పాడుతూ అతని చేతులను పట్టుకున్న సందర్భానికి సంబంధించిన వీడియోను నాగార్జున చూపించారు. ఆ సమయంలో త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలు, అతని ప్రవర్తనపై చర్చ జరిగింది. అనంతరం వర్షిణిని ఉద్దేశించి చీప్ క్యారెక్టర్ అంటూ మాట్లాడిన వీడియోను కూడా ప్రదర్శించారు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు హౌస్‌లోని వారిని నియంత్రించాల్సిన బాధ్యత నీపై ఉందని, అలాంటిది నువ్వే ఇతరుల గురించి అలా మాట్లాడటం సరికాదని నాగార్జున మండిపడ్డారు. ఆటలో ప్రతిభ చూపించడంతో పాటు ప్రవర్తన కూడా ముఖ్యమని హితవు పలికారు. తన దృష్టిలో త్రిగుణ్ స్థాయి తగ్గిందని చెబుతూ గట్టిగా క్లాస్ తీసుకున్నారు. అదే సమయంలో కెప్టెన్‌గా అతను బాగా చేశాడంటూ మిగతా కంటెస్టెంట్లతో చప్పట్లు కొట్టించారు.

నరేష్ నిర్ణయంతో ఫ్యామిలీ వీక్ అవకాశం దూరం

నరేష్‌కు సంబంధించిన టాస్క్ నిర్ణయం కూడా ఎపిసోడ్‌లో కీలకంగా మారింది. గతంలో సంచాలక్‌గా వ్యవహరించిన సమయంలో తన నిర్ణయం తప్పని తేలితే ఫ్యామిలీని త్యాగం చేస్తానని నరేష్ ఛాలెంజ్ చేశాడు. ఆ వీడియోను మళ్లీ చూపించిన నాగార్జున.. టాస్క్‌లో ముకేష్ ఏర్పాటు చేసిన బ్రిక్స్ ఐదు పూర్తికాకముందే కిందపడిపోయాయని వివరించారు. శివ్, అమన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో నరేష్ తీసుకున్న నిర్ణయం తప్పని తేల్చిన నాగార్జున.. అతని కుటుంబ సభ్యులు ఫ్యామిలీ వీక్‌లో హౌస్‌లోకి రాలేరని చెప్పారు. అయితే అమన్, రామకృష్ణ కుటుంబాల్లో ఎవరి ఫ్యామిలీ రావాలో నిర్ణయించే అవకాశం నరేష్‌కు ఇచ్చారు. అమన్ కుటుంబం రావాలని కోరుకున్న నరేష్.. తన కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివర వరకు హౌస్‌లో ఉంటానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని చెప్పాడు.

అమన్ సేఫ్.. మిగిలిన ఏడుగురిపై ఎలిమినేషన్ ఉత్కంఠ

చివర్లో నామినేషన్లలో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్లను నాగార్జున గార్డెన్ ఏరియాలోకి పిలిచారు. రామ్ ప్రసాద్, సుధీర్, నీతూ, శివ్, అమన్, ముకేష్, వర్షిణి, నరేష్‌ల కోసం ఓ ప్రత్యేక టాస్క్ ఏర్పాటు చేశారు. ఇందులో కంటెస్టెంట్ల పేర్ల వెనుక వారి కుటుంబ సభ్యుల ఫొటోలను ఉంచారు. ఆ ఫొటోల్లో తమ కుటుంబ సభ్యులు కనిపిస్తే వారు సేఫ్ అయినట్లు, లేకపోతే నామినేషన్లలోనే కొనసాగినట్లు ప్రకటించారు. ఈ టాస్క్‌లో అమన్ కుటుంబ ఫొటో కనిపించడంతో అతను సేఫ్ అయ్యాడు. మిగిలిన ఏడుగురు మాత్రం ఇంకా నామినేషన్లలోనే ఉన్నారు. మరుసటి ఎపిసోడ్‌లో దీపావళి ప్రత్యేక కార్యక్రమం ఉండటంతో పాటు ఎలిమినేషన్ ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వారం ఎలిమినేషన్ లేదనే ప్రచారం కూడా వినిపిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.