Anirudh Wedding Video: అనిరుధ్ పెళ్లి ఫోటోలు వైరల్.. ‘నాకు అత్యంత ఇష్టమైన మాయాజాలం’ అంటూ వీడియో షేర్!

Anirudh Wedding Video: అనిరుధ్ రవిచందర్ తన భార్య కావ్య మారన్‌తో గ్రీస్‌లో జరిగిన వివాహ వేడుక ఫొటోలతో రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Nov 2026 11:50 PM IST
Anirudh Wedding Video
X

Anirudh Ravichander: అనిరుధ్ పెళ్లి ఫోటోలు వైరల్.. ‘నాకు అత్యంత ఇష్టమైన మాయాజాలం’ అంటూ వీడియో షేర్!

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తన వివాహ వేడుకకు సంబంధించిన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గ్రీస్‌లో జరిగిన తన పెళ్లి వేడుకలో భార్య కావ్య మారన్‌తో కలిసి దిగిన ఫొటోలతో రూపొందించిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు ‘మై ఫేవరెట్ కైండ్ ఆఫ్ మ్యాజిక్’ (నాకు అత్యంత ఇష్టమైన మాయాజాలం) అనే క్యాప్షన్ జోడించారు.

గురువారం తన సోషల్ మీడియా ఖాతాల్లో అనిరుధ్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో వివాహ వేడుకలో అనిరుధ్, కావ్య మారన్ కలిసి సంతోషంగా గడిపిన మధుర క్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోకు నేపథ్య సంగీతంగా అనిరుధ్ స్వరపరిచిన హిట్ పాట ‘అవళుకేన’ (Avalukena)ను జోడించారు. దీంతో ఈ వీడియో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.



గ్రీస్‌లో ఘనంగా వివాహ వేడుక

అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో జరిగింది. కావ్య మారన్ ప్రముఖ వ్యాపారవేత్త, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. అలాగే ఐపీఎల్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కూడా. రెండు రోజుల పాటు గ్రీస్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అతిథుల కోసం ప్రత్యేక విమాన ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం. వివాహం అనంతరం ఈ జంట శనివారం చెన్నైకి తిరిగి వచ్చింది.

‘జీవితకాలంలో ఒక్కసారి జరిగే అద్భుతం’

వివాహం జరిగిన వెంటనే అనిరుధ్ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వాటికి ‘జీవితకాలంలో ఒక్కసారి జరిగే అద్భుతం.. జీవితాంతం తోడుండే బంధం.. 11.11’ అంటూ భావోద్వేగ క్యాప్షన్ ఇచ్చారు. తాజాగా మరోసారి పెళ్లి వేడుకకు సంబంధించిన జ్ఞాపకాలను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు.

ప్రముఖుల హాజరు.. నవంబర్ 21న రిసెప్షన్

ఈ వివాహ వేడుకకు తమిళ సినీ పరిశ్రమ సూపర్‌స్టార్ రజనీకాంత్, కేంద్ర మంత్రి దయానిధి మారన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు, కళానిధి మారన్‌కు చెందిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివాహ వేడుకలోని కొన్ని ప్రత్యేక క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంది.

కాగా, ఈ వివాహ వార్తను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అధికారికంగా ప్రస్తావించింది. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ కుమార్తె కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు. ఈ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో నిర్వహించనున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్