Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ ఇంట్లో ఆస్తి వివాదం.. 1993 గిఫ్ట్ డీడ్‌పై విచారణ

అమితాబ్ బచ్చన్ కుటుంబానికి చెందిన జల్సా బంగ్లాపై ఆస్తి వివాదం మొదలైంది. 1993 నాటి గిఫ్ట్ డీడ్ ద్వారా ఆస్తిని జయా బచ్చన్‌కు బదిలీ చేశారని రమోలా బచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

CR Reddy
Published on: 15 Nov 2026 10:18 AM IST
Amitabh Bachchan
X

Amitabh Bachchan

Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబానికి చెందిన ప్రముఖ బంగ్లా జల్సా ఇప్పుడు ఆస్తి వివాదంతో వార్తల్లో నిలిచింది. అమితాబ్ తమ్ముడు అజితాబ్ బచ్చన్ భార్య రమోలా బచ్చన్.. 1993లో జరిగిన ఆస్తి బదిలీ వ్యవహారాన్ని ప్రశ్నిస్తున్నారు. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండానే జల్సా బంగ్లాను జయా బచ్చన్ పేరు మీదకు మార్చారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో గత ఏడు నెలలుగా రిజిస్ట్రేషన్ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ముంబైలోని అంధేరి డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్యాలయం విచారణ ప్రారంభించింది.

ప్రభుత్వ రికార్డుల్లో రమోలా పేరు

ఈ వివాదానికి ప్రధాన కారణం జల్సా బంగ్లా యాజమాన్యానికి సంబంధించి రెండు రకాల రికార్డుల్లో వేర్వేరు పేర్లు ఉండటమే. ముంబైలోని కపోల్ హౌసింగ్ సొసైటీ రికార్డుల్లో జయా బచ్చన్ పేరు యజమానిగా నమోదై ఉన్నట్లు సమాచారం. కానీ మహారాష్ట్ర ప్రభుత్వ ప్రాపర్టీ కార్డులో మాత్రం రమోలా బచ్చన్ పేరు కొనసాగుతోంది. ఈ రెండు రికార్డుల్లో పేర్లు వేర్వేరుగా ఉండటంతో ఆస్తి బదిలీ ఎలా జరిగింది? దానికి సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రభుత్వ రికార్డుల్లో రమోలా పేరు తొలగించి జయా పేరు చేర్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు వచ్చిన వార్తలతో ఈ వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది.

1993 గిఫ్ట్ డీడ్‌పై రమోలా అభ్యంతరాలు

జల్సా బంగ్లా మొదట తన పేరుతోనే నమోదై ఉండేదని రమోలా చెబుతున్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. 1993లో గిఫ్ట్ డీడ్ ద్వారా ఆస్తిని జయా బచ్చన్‌కు బదిలీ చేసినట్లు ఆమెకు తెలిసిందని, అయితే ఆ ప్రక్రియ తనకు తెలియకుండా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఆ పత్రాన్ని అప్పట్లో స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా తెల్ల కాగితంపై తయారు చేశారని, సాక్షుల సంతకాలు కూడా లేవని ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. ఆ తర్వాత అభయ్ యోజన పథకం కింద ఆ పత్రాన్ని ఎలా క్రమబద్ధీకరించారనే విషయంపైనా ప్రశ్నలు లేవనెత్తారు. ఇవన్నీ రమోలా చేసిన ఆరోపణలే. ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఇంకా అధికారికంగా తేలాల్సి ఉంది.

కుటుంబ సభ్యుల స్పందన ఏమిటి?

రమోలా నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించినట్లు అంధేరి డిప్యూటీ రిజిస్ట్రార్ ఫయాజ్ ములానీ ధ్రువీకరించినట్లు ఎన్డీటీవీ, ఇతర వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించామని, సంబంధిత పక్షాలు తమ వివరణలు, పత్రాలు సమర్పించాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటివరకు గిఫ్ట్ డీడ్ చెల్లుబాటుపై లేదా బంగ్లా అసలు యాజమాన్యంపై అధికారులు తుది నిర్ణయం తీసుకోలేదు. అమితాబ్ బచ్చన్ ఈ వివాదంపై మీడియాకు స్పందించలేదు. జయా బచ్చన్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదు. అభిషేక్ బచ్చన్ ప్రతినిధి మాత్రం ఇది కుటుంబ అంతర్గత వ్యవహారమని చెబుతూ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

జల్సా బంగ్లా వెనుక ఆసక్తికరమైన చరిత్ర

ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న జల్సా బంగ్లాకు అమితాబ్ కుటుంబంతో దశాబ్దాల అనుబంధం ఉంది. ఈ బంగ్లాకు గతంలో మాన్సా అనే పేరు ఉండేదని, ప్రముఖ నిర్మాత ఎన్.సీ. సిప్పీకి చెందినదని వార్తా కథనాలు పేర్కొన్నాయి. 1982లో విడుదలైన సత్తే పే సత్తా సినిమాలో నటించినందుకు పారితోషికంగా అమితాబ్‌కు ఈ బంగ్లా దక్కిందని కూడా ప్రచారం ఉంది. ఆ తర్వాత ఆయన దాన్ని విక్రయించి, మళ్లీ కొనుగోలు చేసి జల్సాగా పేరు మార్చినట్లు కథనాలు చెబుతున్నాయి. ప్రతి ఆదివారం బంగ్లా బయటకు వచ్చి అభిమానులను పలకరించడం అమితాబ్‌కు చాలా ఏళ్లుగా అలవాటు. అలాంటి గుర్తింపు ఉన్న ఇంటిపై ఇప్పుడు 33 ఏళ్ల నాటి గిఫ్ట్ డీడ్ వివాదం మొదలైంది. అధికారులు పత్రాలను పరిశీలించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.