Divorce: విడాకులపై తేల్చేసిన తెలుగు హీరోయిన్.. అలా జరిగిపోయిందంటూ!
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై నటి నీతి టేలర్ క్లారిటీ ఇచ్చారు.
Divorce: విడాకులపై తేల్చేసిన తెలుగు హీరోయిన్.. అలా జరిగిపోయిందంటూ!
Niti Taylor: తెలుగులో తక్కువ సినిమాలే చేసినప్పటికీ, హిందీ టెలివిజన్ రంగంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న నీతి టేలర్ 2020లో ఇండియన్ ఆర్మీ అధికారి పరిక్షిత్ బవాతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. ఈ ఊహాగానాలపై స్పందించిన నీతి టేలర్.. అవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లేనని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో ఏదో ఒకటి వైరల్ అయినంత మాత్రాన వాటిని నమ్మాల్సిన పనిలేదని నీతి తేల్చిచెప్పింది. నిజం కాని విషయాలు తమ వ్యక్తిగత జీవితాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేవని పేర్కొంది. తమ బంధం గురించి తమకు పూర్తిగా అవగాహన ఉందని, తమ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలను పూర్తిగా ఇష్టపూర్వకంగానే తీసుకున్నామని వెల్లడించింది.
ప్రస్తుతం తామిద్దరం ఎంతో సంతోషంగా, క్షేమంగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నామని చెబుతూ విడాకుల ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టింది. అంతేకాకుండా, తమ సంతోషకరమైన కాపురానికి ఎవరూ దిష్టి పెట్టవద్దని ఆమె సరదాగా కోరుకున్నారు.
ఇక తన గతం గురించి మాట్లాడుతూ గతంలో తాను ఎదుర్కొన్న మానసిక వేదనను నీతి గుర్తుచేసుకుంది. ఒకానొక సందర్భంలో ఓటీటీ రియాలిటీ షోలో పాల్గొన్న ఆమె తన మాజీ బాయ్‌ఫ్రెండ్ తనను సిగరెట్‌తో కాల్చి గాయపరిచాడని, తీవ్రంగా హింసించాడని కన్నీటిపర్యంతరమైంది.
చిన్న వయసులో మనుషుల స్వభావాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయానని, పుట్టినరోజు నాడే తనపై దాడికి పాల్పడటంతో ఆ భయానక బంధం నుంచి బయటపడాల్సి వచ్చిందని తెలిపింది. ఆ కష్టకాలం నుంచి బయటపడిన తన జీవితంలోకి ఆర్మీ ఆఫీసర్ పరిక్షిత్ ప్రవేశించడం ఎంతో ప్రత్యేకమని, ఆయనొచ్చాక తన జీవితం పూర్తిగా మారిపోయిందని ఆనందం వ్యక్తం చేసింది.
తెలుగులో 'మేం వయసుకు వచ్చాం', 'పెళ్లి పుస్తకం' వంటి చిత్రాల ద్వారా నటిగా ప్రయాణం మొదలుపెట్టిన నీతి టేలర్.. ఆ తర్వాత బుల్లితెరపై సీరియల్స్, రియాలిటీ షోలు, మ్యూజిక్ వీడియోలతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం భర్త పరిక్షిత్తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నానని ఆమె స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.




