Allu Sirish: అర్ధరాత్రి లౌడ్‌స్పీకర్ల మోత.. పోలీసులను ఆశ్రయించిన సినీ నటుడు అల్లు శిరీష్!

Allu Sirish: శబ్ద కాలుష్యంపై సినీ నటుడు అల్లు శిరీష్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి వేళల్లోనూ లౌడ్‌స్పీకర్లతో ఇబ్బంది కలుగుతోందని షేక్‌పేట అపర్ణా వన్ నివాసి అల్లు శిరీష్ ఫిర్యాదు చేశారు.

Arun Chilukuri
Published on: 28 Sept 2026 12:45 PM IST
Allu Sirish
X

Allu Sirish: అర్ధరాత్రి లౌడ్‌స్పీకర్ల మోత.. పోలీసులను ఆశ్రయించిన సినీ నటుడు అల్లు శిరీష్!

Allu Sirish: హైదరాబాద్ నగరంలో శబ్ద కాలుష్యంపై టాలీవుడ్ సినీ నటుడు అల్లు శిరీష్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి వేళల్లోనూ అధిక శబ్దంతో మైకులు, లౌడ్‌స్పీకర్లు వినిపిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై హైదరాబాద్ సిటీ పోలీసులను సోషల్ మీడియా వేదికగా ట్యాగ్ చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

షేక్‌పేటలోని ‘అపర్ణా వన్’ గేటెడ్ సొసైటీలో నివసిస్తున్న అల్లు శిరీష్.. తన నివాసానికి సమీపంలోని వినోభానగర్ హనుమాన్ ఆలయం నుంచి గత కొన్ని రోజులుగా భారీ శబ్దంతో సంగీతం, మైకులు వాడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఈ శబ్దాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కారణంగా అపార్ట్‌మెంట్‌లోని వృద్ధులు, చిన్న పిల్లలు, ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు ప్రశాంతంగా నిద్రపోలేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వాపోయారు.

ఈ సమస్యపై ఇప్పటికే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అల్లు శిరీష్ తెలిపారు. అయితే గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సెప్టెంబర్ 25 వరకు సహకరించాలని ఆ సమయంలో పోలీసులు కోరినట్లు చెప్పారు. అయితే సెప్టెంబర్ 25తో గణేశ్ నిమజ్జనం పూర్తయినప్పటికీ, ఆలయం వద్ద మైకుల మోత మాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. గతంలోనూ పలుమార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా పూర్తిస్థాయి పరిష్కారం దొరకలేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి వేళల్లో లౌడ్‌స్పీకర్లు వినిపించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. అల్లు శిరీష్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నగరంలోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి శబ్ద కాలుష్య సమస్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.