Ranabaali Movie Review: కరువు వెనుక కుట్రపై విజయ్ దేవరకొండ వీరపోరాటం.. హిట్ కొట్టాడా?

Ranabaali Movie Review: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి' మూవీ వివరణాత్మక రివ్యూ.

Arun Chilukuri
Published on: 16 Oct 2026 5:53 PM IST
Ranabaali Movie Review
X

Ranabaali Movie Review: కరువు వెనుక కుట్రపై విజయ్ దేవరకొండ వీరపోరాటం.. హిట్ కొట్టాడా?

టైటిల్‌: రణబాలి

నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఆర్నాల్డ్ వాస్లూ తదితరులు

దర్శకత్వం: రాహుల్ సాంకృత్యాన్

రచన: ప్రమోద్ తమ్మినేని

సంగీతం: అజయ్–అతుల్

సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్జీ, నిరవ్ షా

ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్

నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్

విడుదల: అక్టోబర్ 16, 2026

కథేంటంటే..

1876–78 మధ్యకాలంలో మద్రాసు ప్రెసిడెన్సీని అతలాకుతలం చేసిన భయంకరమైన కరువు నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. మద్రాసుకు కొత్తగా వచ్చిన కమిషనర్ (ఆర్నాల్డ్ వోస్లూ) ఇక్కడ పండిన ప్రతి ధాన్యం గింజా బ్రిటన్‌కు వెళ్లాల్సిందేనని ఆదేశిస్తూ కఠిన ఆంక్షలు విధిస్తాడు. ధాన్యం దేశం దాటించడానికి రైల్వే పనులు ప్రారంభించి, కృత్రిమ కరువును సృష్టించి ప్రజలను కూలీలుగా మారుస్తాడు.

ఈ దారుణ అణచివేత రాయలసీమ ప్రాంతానికి చెందిన పాలెగాడు, భద్రమల్లన్న స్వామి ఆశీస్సులతో పెరిగిన సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) దృష్టికి వెళ్తుంది. ఆకలి కేకలతో అలమటిస్తున్న ప్రజలకు రణబాలి ఎలా అండగా నిలిచాడు? కరువుకు కారణమైన మద్రాసు కమిషనర్‌ని ఎలా అంతం చేశాడు? ఈ పోరాటంలో జయమ్మ (రష్మిక) పాత్ర ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కరువు వెనుక ఉన్న బ్రిటీష్ కుట్రలను, ప్రజలు ఎందుకు తిరగబడ్డారనే కోణాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ బాగా పరిశోధించి తెరకెక్కించారు. కేవలం హీరో ఎలివేషన్లకే పరిమితం కాకుండా సామాజిక నేపథ్యాన్ని స్పష్టంగా చూపించారు.

ఫస్టాఫ్ ఓకే - సెకండాఫ్ సాగదీత: సినిమా ప్రారంభంలో బుర్రకథ నేపథ్యం, విజయ్ ఎంట్రీ, ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు చాలా ఆసక్తికరంగా సాగుతాయి. అయితే సెకండాఫ్‌లో కరువు కష్టాలను పదే పదే చూపించడం, క్లైమాక్స్ సన్నివేశాలు సాగదీతగా అనిపించడం మైనస్.

యాక్షన్ & గూస్‌బంప్స్ సీన్లు: గుహలో వచ్చే యాక్షన్ సీన్ మరియు కొన్ని బ్రిటీష్ అక్రమాల సన్నివేశాలు ప్రేక్షకులను తీవ్రంగా ఆకట్టుకుంటాయి.

ఎవరెలా చేశారంటే..

విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో ఒదిగిపోయారు. మాస్ ఇమేజ్‌కు భిన్నంగా ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో పరకాయ ప్రవేశం చేశారు. నటుడిగా ఆయనకు ఇది నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్.

రష్మిక మందన్న జయమ్మగా తన పరిధి మేర చక్కగా నటించింది. విజయ్-రష్మిక ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ, మొదటి రాత్రి కామిడీ సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి.

ఆర్నాల్డ్ వోస్లూ మద్రాసు కమిషనర్‌గా క్రూరమైన విలనిజం పండించారు. ఈశ్వరీరావు మరియు ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం

సినిమాటోగ్రఫీ & ఆర్ట్: జిష్ణు భట్టాచార్జీ, నిరవ్ షా కెమెరా వర్క్, విఠల్ కోసనం ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఆ కాలం నాటి పరిస్థితులను సహజంగా తెరపైకి తీసుకొచ్చాయి.

సంగీతం & ఎడిటింగ్: అజయ్-అతుల్ పాటలు బాగున్నా, కొన్ని ఎలివేషన్ సీన్లకు తగిన స్థాయిలో నేపథ్య సంగీతం (BGM) పడలేదు. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌లో ఇంకాస్త కత్తెర వేసి నిడివి తగ్గించాల్సింది.

రేటింగ్: 3.25/5

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.