Happy Journey Movie Review: ఏడుగురు మహిళల ఫ్రాన్స్ జర్నీ ఎలా సాగింది.. సినిమా ఎలా ఉందంటే?
హ్యాపీ జర్నీ మూవీ రివ్యూ: అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా నటించిన హ్యాపీ జర్నీ సినిమా ఎలా ఉంది?
Happy Journey Movie Review: ఏడుగురు మహిళల ఫ్రాన్స్ జర్నీ ఎలా సాగింది.. సినిమా ఎలా ఉందంటే?
Happy Journey Movie Review: ట్రావెల్ నేపథ్యంలో తెలుగు తెరపై ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అదే కోవలో విభిన్న వయసులు, భిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఏడుగురు మహిళలను ఒకే ప్రయాణంలో కలిపి.. వారి జీవితాల్లోని కష్టసుఖాలు, సరదా సంఘటనలు, భావోద్వేగాలను చూపించే ప్రయత్నంగా తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అభిరామ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాను గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రల్లో నటించారు. వంశీ, రవి శివతేజ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘హ్యాపీ జర్నీ’ ఎలా ఉందో తెలుసుకుందాం.
కథ
గోవింద్ (వంశీ), అప్పారావు (రవి శివతేజ) కలిసి ఓ ట్రావెల్ కంపెనీని నిర్వహిస్తుంటారు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో దాన్ని తిరిగి లాభాల బాట పట్టించేందుకు ఓ వినూత్న ప్లాన్ వేస్తారు. ఇందులో భాగంగా ఏడుగురు మహిళలను ఉచితంగా ఫ్రాన్స్ ట్రిప్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటారు.
ఈ ప్రయాణంలో జీవితాన్ని తనదైన శైలిలో ఆస్వాదించాలనుకునే సావిత్రి (అన్నపూర్ణమ్మ), మంత్రి భార్య చాముండేశ్వరి (ఆమని), భర్తతో విడాకుల సమస్యతో మానసిక ఆందోళనలో ఉన్న నయన (జినీషా అలిశెట్టి), తన అల్లుడి గొప్పతనం గురించి ఎప్పుడూ చెప్పే శ్రీలత (ఝాన్సీ), ప్యారిస్‌లో ఉంటున్న నిఖిల్‌తో పెళ్లి నిశ్చయమైనా ఆ బంధంపై స్పష్టత లేని తన్వి (పాయల్ రాధాకృష్ణ), సోషల్ మీడియా ద్వారా పరిచయమైన బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి ప్యారిస్ వచ్చిన విహన (రూపా శ్రీనివాస్), ప్రతి చిన్న విషయానికీ భయపడే దివ్య (సునైనా) ఉంటారు.
విభిన్న నేపథ్యాలు, మనస్తత్వాలు కలిగిన వీరంతా ఫ్రాన్స్‌లో అడుగుపెట్టిన తర్వాత జరిగే సంఘటనలు, సరదా గొడవలు ప్రేక్షకులను నవ్విస్తాయి. అయితే అనూహ్యంగా దివ్య కనిపించకుండా పోవడంతో కథలో కీలక మలుపు వస్తుంది. అసలు గోవింద్ వీళ్లందరికీ ఉచితంగా ఫ్రాన్స్ ట్రిప్ ఎందుకు ఏర్పాటు చేశాడు? దివ్య ఏమైంది? ఈ ప్రయాణం తర్వాత ఏడుగురు మహిళల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనేదే మిగతా కథ.
సినిమా ఎలా ఉంది?
‘హ్యాపీ జర్నీ’ ప్రారంభం నుంచే ప్రధాన పాత్రల పరిచయాలతో ఉత్సాహంగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో దర్శకుడు ఎక్కువగా వినోదానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఫ్రాన్స్‌లో ఏడుగురు మహిళల మధ్య చోటుచేసుకునే సంఘటనలు, సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ కామెడీ ప్రేక్షకులను అలరిస్తుంది.
దివ్య కనిపించకుండా పోవడంతో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండ్ హాఫ్‌లో కథ వినోదం నుంచి భావోద్వేగాల వైపు మళ్లుతుంది. మహిళల స్వేచ్ఛ, వ్యక్తిగత నిర్ణయాలు, కుటుంబ విలువలు వంటి అంశాలను దర్శకుడు ప్రస్తావించారు.
అయితే కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. కొన్ని ఎమోషనల్ సీన్లు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులతో కనెక్ట్ కాకపోవడం మైనస్‌గా మారింది. క్లైమాక్స్‌కు చేరుకునే సరికి కథ మళ్లీ గాడిలో పడుతుంది. గోవింద్ పాత్ర చుట్టూ వచ్చే ట్విస్ట్, కుటుంబ బంధాలకు ఇచ్చిన ప్రాధాన్యత సినిమాకు బలంగా నిలుస్తాయి.
నటీనటుల నటన
అన్నపూర్ణమ్మ ‘హ్యాపీ జర్నీ’కి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మోడ్రన్ లుక్‌లో ఆమె చేసిన కామెడీ, చూపించిన ఎనర్జీ ప్రేక్షకులను నవ్విస్తుంది. మంత్రి భార్య పాత్రలో ఆమని సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.
ఝాన్సీ తనదైన నటనతో అక్కడక్కడా నవ్వించడంతో పాటు క్లైమాక్స్‌కు ముందు భావోద్వేగ సన్నివేశాల్లో మెప్పించారు. పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్ తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు. భయపడే స్వభావం కలిగిన దివ్య పాత్రలో సునైనా వైవిధ్యమైన నటనను ప్రదర్శించారు. వంశీ, రవి శివతేజ తమ కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగం
‘హ్యాపీ జర్నీ’కి సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచింది. ఫ్రాన్స్‌లోని అందమైన లొకేషన్స్, నగరాలు, టూరిస్ట్ ప్రదేశాలను కెమెరాతో ఆకర్షణీయంగా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపు ఓ ట్రావెల్ వ్లోగ్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
నేపథ్య సంగీతం సన్నివేశాలకు అనుగుణంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సెకండ్ హాఫ్ మరింత క్రిస్ప్‌గా ఉండేది. తక్కువ బడ్జెట్‌లో విదేశీ లొకేషన్లలో సినిమాను అందంగా తెరకెక్కించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తుది తీర్పు
‘హ్యాపీ జర్నీ’ కేవలం ఓ ఫ్రాన్స్ ట్రిప్ కథగా కాకుండా.. విభిన్న మనస్తత్వాలు కలిగిన ఏడుగురు మహిళల జీవితాలు, వారి భావోద్వేగాలను ప్రయాణంతో ముడిపెట్టి చెప్పిన లైట్ హార్టెడ్ ఎంటర్‌టైనర్. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, సెకండ్ హాఫ్‌లో కుటుంబ భావోద్వేగాలు, ఫ్రాన్స్ అందాలను చూపించే విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు.
వీకెండ్‌లో కుటుంబంతో కలిసి సరదాగా చూడదగ్గ చిత్రంగా ‘హ్యాపీ జర్నీ’ నిలుస్తుంది.
రేటింగ్: 3/5




