Narsapur: నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ విషాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో భోజనం చేసి అస్వస్థతకు గురైన వారిలో సాయిరాం అనే యువకుడు మృతి చెందాడు.

ASHOK REDDY, NARASAPOOR
Updated on: 14 Oct 2026 3:59 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ విషాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి!

Narsapur: నర్సాపూర్ పట్టణంలో ఫుడ్ పాయిజన్ ఘటన విషాదాన్ని నింపింది. పట్టణంలోని వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్న 15 మంది అస్వస్థతకు గురికాగా, వారిలో చికిత్స పొందుతున్న సాయిరాం అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్ పట్టణంలోని వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో భోజనం చేసిన 15 మందిలో 14 మంది అస్వస్థతకు గురై నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో సాయిరాం అనే యువకుడి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయిరాం మృతి చెందినట్లు సమాచారం.

రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో తీరని విషాదం

రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సాయిరాం కుటుంబానికి ఈ ఘటన తీరని శోకాన్ని మిగిల్చింది. కళ్లముందే కన్న కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది.

ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని నర్సాపూర్ పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆహారం నాణ్యత, ఆహార భద్రత ప్రమాణాల అమలు, ఘటనకు గల కారణాలపై సంబంధిత అధికారులు పరిశీలన జరిపి, విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరోవైపు, సాయిరాం మృతిపై నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పోలీసుల విచారణ, సంబంధిత అధికారుల చర్యలతోనే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

ఒకవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు.. మరోవైపు యువకుడి మృతితో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం.. ఈ ఘటన నర్సాపూర్‌లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆహార భద్రత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

గమనిక. ఫుడ్ పాయిజన్ కారణంగానే సాయిరాం మృతి చెందాడా అనే అంశం అధికారిక విచారణ, వైద్య నివేదికల ద్వారా నిర్ధారణ కావాల్సి ఉంది.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR