Medak: మెదక్‌లో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, భారీ ర్యాలీ!

Medak: మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు. భారీ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎంపీ రఘునందన్ రావు.

NAGARAJ, MEDAK
Published on: 27 Sept 2026 12:35 PM IST
Medak
X

Medak: మెదక్‌లో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, భారీ ర్యాలీ!

Medak: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా పర్యాటక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సుమారు 4 వేల మంది పాల్గొన్న భారీ ర్యాలీతో మెదక్ సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలు ప్రతిబింబించాయి.

మెదక్ ఖిల్లాపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు ఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతిరాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్ ఖిల్లా సందర్శనార్థం ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్‌ను ప్రారంభించారు. ఖిల్లా నుంచి వెస్లీ కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది.

ర్యాలీలో డప్పు, డోలు, తంబుర, చిందు, భాగవతం, బోనాలు, బతుకమ్మ, గిరిజన లంబాడీ కళారూపాలు, గీత కార్మికులు, కరాటే, ఎన్‌సీసీ విద్యార్థులు, ఒగ్గు కళాకారులు తదితర 16 కళారూపాలకు చెందిన కళాకారులు సంప్రదాయ వేషధారణలో పాల్గొని ఆకట్టుకున్నారు.

అనంతరం వెస్లీ కళాశాలలో పర్యాటక రంగానికి సంబంధించిన ఏవీ ప్రదర్శనను వీక్షించారు. శాంతికి ప్రతీకగా ఎంపీ రఘునందన్‌రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు ఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతిరాజు తెల్లటి పావురాలను ఎగురవేశారు. అనంతరం మెదక్ జిల్లా పర్యాటక అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.

మెదక్‌ను ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలి. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ మెదక్‌ను ‘మెతుకు సీమ’గా పేర్కొంటూ ప్రపంచానికి అన్నం పెట్టిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నారు. మెదక్ జిల్లాలోని చారిత్రక, ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పోచారం అభయారణ్యం, నర్సాపూర్ అర్బన్ పార్క్, ఏడుపాయల వనదుర్గ ఆలయం, మెదక్ చర్చి తదితర పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. మెదక్ జిల్లాను ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని ప్రస్తావించారు.

పర్యాటక ప్రాంతాల్లో ప్రకృతిని పరిరక్షించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ప్రత్యామ్నాయంగా స్టీల్ వస్తువులను ఉపయోగించాలని సూచించారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే హోటళ్లు, టూరిస్ట్ గైడ్లు, స్థానిక ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. శని, ఆదివారాల్లో పర్యాటక ప్రాంతాల్లో పెరిగే వాహనాల రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

14 పర్యాటక ప్రాంతాలను గుర్తించాం కలెక్టర్

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో అపారమైన చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక సంపద ఉందన్నారు. భావితరాలకు ఈ సంపదను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

మెదక్ జిల్లాను పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు 14 ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమన్నారు. టూరిజం అభివృద్ధి చెందితే స్థానిక ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

అదనపు ఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలోని చారిత్రక ప్రదేశాలు, వారసత్వ సంపదను భవిష్యత్ తరాల కోసం సంరక్షించుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతిరాజు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ఉన్న అపారమైన వారసత్వ సంపద జిల్లా ప్రజల అదృష్టమన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు మెదక్‌కు వచ్చేలా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల సహకారం అవసరమన్నారు.

ఈ సందర్భంగా పర్యాటక రంగంపై విద్యార్థులు ప్రదర్శించిన కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.

కార్యక్రమంలో డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈవో, జిల్లా టూరిజం అధికారి ఎల్లయ్య, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీపీఆర్‌ఓ రామచంద్రరాజు, స్పోర్ట్స్ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ నవీన్, మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కళాకారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK