Veldurthi: వెల్దుర్తి జెడ్పీ స్కూల్ విద్యార్థులకు రోబోటిక్స్ శిక్షణ!

Veldurthi: మెదక్ జిల్లా వెల్దుర్తి పీఎం శ్రీ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు సోహం రోబోటిక్స్ ఇన్ అకాడమీ ఆధ్వర్యంలో రోబోటిక్స్, ఆధునిక సాంకేతికతపై శిక్షణ అందించారు.

RAJU,TOOPRAN
Published on: 28 Oct 2026 7:08 PM IST
Veldurthi
X

Veldurthi: వెల్దుర్తి జెడ్పీ స్కూల్ విద్యార్థులకు రోబోటిక్స్ శిక్షణ!

వెల్దుర్తి: విద్యార్థులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో వెల్దుర్తి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోబోటిక్స్‌పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. సోహం రోబోటిక్స్ ఇన్ అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు, ఆచరణాత్మకంగా నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

శిక్షణలో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి సంస్థకు చెందిన నిపుణులు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పలు అంశాలపై బోధిస్తున్నారు. రోబోట్ల నిర్మాణం, పనితీరు, వాటి వినియోగం, ఆధునిక సాంకేతికతకు సంబంధించిన ప్రాథమిక అంశాలను వివరిస్తున్నారు. కేవలం సిద్ధాంతపరమైన బోధనకే పరిమితం కాకుండా, ప్రయోగాల ద్వారా విషయాలను అర్థం చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.

ఈ శిక్షణతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, తార్కిక విశ్లేషణ, సమస్యల పరిష్కార నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనా విధానం మెరుగుపడే అవకాశం ఉందని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి. చిన్న వయసులోనే సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించడం భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు, నూతన ఆవిష్కరణల దిశగా ముందుకు సాగేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డాయి.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సాంబయ్య మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు సంప్రదాయ విద్యతో పాటు ఆధునిక సాంకేతిక అంశాలపై కూడా శిక్షణ అందించడం అవసరమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచడంతో పాటు, వారి ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రోబోటిక్స్ శిక్షకులు వివేక్, మేఘన, రాజ్ కుమార్, అంకుష్, వర్ధన్, దత్తాత్రి అరవింద్ పాల్గొని విద్యార్థులకు శిక్షణ అందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN