Gajwel: రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి: వంటేరు ప్రతాప్ రెడ్డి!
Gajwel: రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్‌లో బీఆర్‌ఎస్ నిరసన చేపట్టింది. స్పందించకపోతే రహదారులను దిగ్బంధిస్తామని వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు.
Gajwel: రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి: వంటేరు ప్రతాప్ రెడ్డి!
గజ్వేల్: రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. అనంతరం బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి సబ్‌స్టేషన్‌లోని విద్యుత్ సరఫరా లాగ్‌బుక్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 12 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం కేవలం 7 గంటల విద్యుత్ మాత్రమే సరఫరా చేస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లో-వోల్టేజ్ కారణంగా మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించారని, అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టుల నుంచి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు.
రైతులు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారని, సాగునీరు, విద్యుత్ అందకపోతే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల పంటలను కాపాడాలని కోరారు.
రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రెండు, మూడు రోజుల్లో వేలాది మంది రైతులతో మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి రహదారులను దిగ్బంధిస్తామని వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.




