Narsapur: నర్సాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ తాహెర్ అక్కడికక్కడే మృతి చెందారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 14 Nov 2026 5:11 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూ క్లాసిక్ గార్డెన్స్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మెదక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ తాహెర్ (54) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన కుమారుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

అతివేగంతో వచ్చి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన కారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 13వ తేదీ అర్ధరాత్రి న్యూ క్లాసిక్ గార్డెన్స్‌లో జరిగిన శుభకార్యానికి హాజరైన హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ తాహెర్ తన కుమారుడు ఖాజా మొయినుద్దీన్ (19)తో కలిసి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో రాత్రి సుమారు 11:15 గంటల సమయంలో గార్డెన్స్‌కు సమీపంలో నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి వారి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఘటనా స్థలంలోనే హెడ్ కానిస్టేబుల్ మృతి

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఖాజా మొయినుద్దీన్‌కు ఎడమ కాలు, ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. వెనుక కూర్చున్న తండ్రి మహమ్మద్ తాహెర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అంతటితో ఆగకుండా అదుపుతప్పిన కారు కొద్దిదూరంలో వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని (TS35B9507) ఢీకొట్టింది. ఈ ఘటనలో రామచంద్రాపురం గ్రామానికి చెందిన చిగురు ప్రదీప్ (27), తలారి నవీన్ (27) తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం

సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కొందరిని సంగారెడ్డిలోని ధరణి ఆసుపత్రికి, మరికొందరిని సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసుల దర్యాప్తు

ప్రమాద సమాచారం అందుకున్న నర్సాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య సజీదా జబీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని కారు, డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

వాహనదారులకు పోలీసుల హెచ్చరిక

అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్‌తో నిండు ప్రాణాలు బలవుతున్నాయని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో వాహనాలు నడిపేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా కాపాడాలని నర్సాపూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR