Patancheru: చదువుతో పాటు క్రీడలు ముఖ్యం: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Patancheru: పటాన్‌చెరు మైత్రి మైదానంలో ముగిసిన రాష్ట్రస్థాయి అండర్-17 కుస్తీ పోటీల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Oct 2026 9:24 PM IST
Patancheru
X

Patancheru: చదువుతో పాటు క్రీడలు ముఖ్యం: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్చెరు: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని.. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

గత రెండు రోజులుగా పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానం వేదికగా జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి అండర్ 17 బాల బాలికల కుస్తీ పోటీలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ముగిసాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉత్సాహభరిత వాతావరణంలో సాగిన ఈ పోటీలు క్రీడాభిమానుల్లో ఆనందోత్సాహాలను నింపాయి.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతోపాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్నప్పుడే జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు పటాన్చెరు మైత్రి మైదానం కేంద్రంగా నిలవడం సంతోషకరమని అన్నారు. ఇలాంటి పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించవచ్చని అభిప్రాయపడ్డారు.

విద్యార్థులు కేవలం విద్యకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ తమ ప్రతిభను చాటుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సూచించారు. క్రీడలను విద్యార్థుల దినచర్యలో భాగం చేసినప్పుడే ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన యువతను తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎట్టయ్య, పృథ్వీరాజ్, రాజ్ కుమార్, రాము, షకీల్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్