Sangareddy: సంగారెడ్డిలో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్!
Sangareddy: రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా సంగారెడ్డిలో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్. సైబర్ నేరాలపై అవగాహన, బాధితులకు రూ.3.79 కోట్లు ఇప్పించామని ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడి.
Sangareddy: సంగారెడ్డిలో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్!
Sangareddy: రాష్ట్రియ ఏకతా దివస్ (రాష్ట్ర ఐక్యతా దినోత్సవం), సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని ఐబి నుండి జిల్లా పోలీసు కార్యాలయం వరకు సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్. కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి, ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా అక్టోబర్ నెలలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమాలు శనివారం ఫ్లాష్ వాక్‌తో ముగిశాయి.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ మాట్లాడుతూ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ పోలీసుల ఆదేశాల మేరకు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో 'సైబర్ జాగరూకత దివస్' కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ నెలను సైబర్ సెక్యూరిటీ అవగాహన మాసంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రతి వారం ఒక్కో వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అవగాహన కల్పించినట్లు తెలిపారు. మొదటి వారంలో విద్యార్థులు, యువతకు, రెండో వారంలో ప్రజలు, వ్యాపారులకు, మూడో వారంలో వృద్ధులు, వివిధ వర్గాల ప్రజలకు, నాలుగో వారంలో పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు, సైబర్ వాలంటీర్లు, అవగాహన కేంద్రాల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించినట్లు వివరించారు.
అక్టోబర్ నెలలో జిల్లా వ్యాప్తంగా సుమారు 70 సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు 6,785 మందికి అవగాహన కల్పించినట్లు ఎస్పీ తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, మార్కెట్లు, పార్కులు, క్రీడా మైదానాలు, దుకాణాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్సీసీ క్యాడెట్లు, వైద్యులు, తల్లిదండ్రులు, వృద్ధులు, ప్రయాణికులు, వ్యాపారులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.
డిజిటల్ అరెస్ట్ మోసాలు, యూపీఐ, క్యూఆర్ కోడ్ మోసాలు, ఓటీపీ, పాస్వర్డ్ చోరీ, నకిలీ పెట్టుబడి పథకాలు, నకిలీ ఉద్యోగ ఆఫర్లు, ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్, హానికరమైన ఏపీకే ఫైల్స్, ఆన్లైన్ షాపింగ్, నకిలీ కస్టమర్ కేర్ మోసాలు, సోషల్ మీడియా ఖాతాల హ్యాకింగ్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 289 సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎస్పీ వెల్లడించారు.
సైబర్ మోసాల బాధితులకు ఆర్థికంగా అండ:
సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు, మోసాలకు గురైన బాధితులకు న్యాయం జరిగేలా జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎస్పీ తెలిపారు.
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా మొత్తం 2,124 ఫిర్యాదులు అందగా, బాధితులు రూ.12.60 కోట్ల మేర మోసపోయినట్లు తెలిపారు. వీటిలో 266 కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, రూ.4.73 కోట్లను నిలిపివేయగలిగినట్లు పేర్కొన్నారు. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు లోక్ అదాలత్ ద్వారా 459 సైబర్ ఫిర్యాదులను పరిష్కారానికి తీసుకుని, బాధితులకు రూ.3.79 కోట్లను తిరిగి ఇప్పించినట్లు తెలిపారు.
ఎంఆర్ఎం పోర్టల్ ద్వారా తిరిగి పొందేందుకు వీలున్న 580 లావాదేవీలను గుర్తించి, వాటిలో 355 లావాదేవీలకు సంబంధించి రూ.21.90 లక్షలను బాధితులకు తిరిగి ఇప్పించినట్లు తెలిపారు. ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.41.40 లక్షలుగా ఉందన్నారు.
జీఆర్ఎం పోర్టల్ ద్వారా బ్యాంకు ఖాతాలపై విధించిన హోల్డ్ తొలగింపు, ఖాతాల అన్‌ఫ్రీజింగ్ తదితర సమస్యలకు సంబంధించి 54 ఫిర్యాదులను పరిష్కరించినట్లు వెల్లడించారు.
సైబర్ నేరాలకు సంబంధించిన పీటీ వారెంట్ల అమలులో భాగంగా 2024లో 45, 2025లో 49, 2026లో ఇప్పటివరకు 10 వారెంట్లు అమలు చేసినట్లు తెలిపారు.
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. మీ ఓటీపీ, ఏటీఎం పిన్, యూపీఐ పిన్, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పకూడదు.
2. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. పోలీసులమని, సీబీఐ, ఈడీ అధికారులమని వీడియో కాల్స్ ద్వారా బెదిరిస్తే నమ్మకూడదు. వెంటనే కాల్ కట్ చేయాలి.
3. పెట్టుబడి పథకాలు, ఉద్యోగ ఆఫర్లు, కస్టమర్ కేర్ నంబర్లను అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే నమ్మాలి.
4. భయపెట్టి లేదా అత్యవసర పరిస్థితి సృష్టించి డబ్బులు బదిలీ చేయమంటే చేయకూడదు.
5. తెలియని క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయకూడదు. గుర్తు తెలియని యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్‌లను ఆమోదించకూడదు.
6. వాట్సాప్, ఎస్ఎంఎస్ లేదా ఇతర గుర్తు తెలియని మార్గాల ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయకూడదు.
7. బ్యాంకింగ్, సోషల్ మీడియా ఖాతాలకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.
8. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి. ముఖ్యంగా మోసం జరిగిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన డబ్బును నిలిపివేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.




