Medak: మెదక్‌లో విద్యార్థులకు పోషకాహార అల్పాహార కార్యక్రమం విస్తరణ!

Medak: మెదక్ జిల్లాలో విద్యార్థులకు పోషకాహార అల్పాహార కార్యక్రమం. 395 ప్రభుత్వ పాఠశాలల్లోని 29 వేలకు పైగా విద్యార్థులకు లబ్ధి చేకూర్చనున్న హరే కృష్ణ ఫౌండేషన్.

NAGARAJ, MEDAK
Published on: 26 Sept 2026 11:25 AM IST
Medak
X

Medak: మెదక్‌లో విద్యార్థులకు పోషకాహార అల్పాహార కార్యక్రమం విస్తరణ!

Medak: నిరుపేద విద్యార్థులు ఆకలితో పాఠశాలకు రాకుండా, వారికి పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించి చదువుపై దృష్టి సారించేలా చేయడమే స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా రీజినల్ ప్రెసిడెంట్ సత్య గౌరవ చంద్రదాస్ తెలిపారు.

శనివారం మెదక్ మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌ను పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిందన్నారు. కార్యక్రమానికి వచ్చిన స్పందనతో మధిర, మంథని, మంచిర్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించడంలో భాగంగా మెదక్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. దీని ద్వారా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని సుమారు 11 మండలాల పరిధిలో 395 ప్రభుత్వ పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 29,183 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన, రుచికరమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నట్లు వివరించారు.

విద్యార్థులకు సమతుల్యమైన పోషకాహారం అందించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సహకారంతో అల్పాహార మెనూను రూపొందించినట్లు తెలిపారు. ఇడ్లీ–సాంబార్, పూరీ–ఆలూ కుర్మా, దోశ–చట్నీ, ఉప్మా–చట్నీ, మిల్లెట్ ఇడ్లీ–సాంబార్, బోండా–చట్నీ వంటి వివిధ రకాల అల్పాహారాన్ని అందించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా రోజు విడిచి రోజు విద్యార్థులకు వేడి పాలను అందించనున్నట్లు తెలిపారు.

కొడంగల్‌లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, సుమారు 5 వేల మంది విద్యార్థులు తిరిగి పాఠశాలలకు రావడం సంతోషకరమైన విషయమని సత్య గౌరవ చంద్రదాస్ తెలిపారు. ఈ అనుభవంతో తెలంగాణలోని మరిన్ని ప్రాంతాలకు కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉదయం పూట పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రత, పాఠశాల హాజరు మెరుగుపడేలా కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఆకలితో కాకుండా ఆరోగ్యకరమైన అల్పాహారంతో ఉత్సాహంగా పాఠశాలకు హాజరై చదువుపై దృష్టి సారించేలా చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK