Sangareddy: NH-65 పై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!

Sangareddy: సంగారెడ్డి, బీదర్ జిల్లాల్లో NH-65 పై వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎయిర్ పిస్టల్, కత్తులు, బైక్ స్వాధీనం.

Srinivas K, Sangareddy
Published on: 6 Nov 2026 4:41 PM IST
Sangareddy
X

Sangareddy: NH-65 పై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో నమోదైన వరుస దారి దోపిడీ కేసులను ఛేదించేందుకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సీసీఎస్, జహీరాబాద్ సబ్ డివిజన్, సదాశివపేట పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టి, జిల్లాలో నమోదైన మూడు దారి దోపిడీ కేసులతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి NH-65 పై జరిగిన మరో దారి దోపిడీ కేసును ఛేదించడం జరిగింది.

ఈ కేసులకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన ముగ్గురు కరుడుగట్టిన నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఛేదించిన దారిదోపిడి నేరాల వివరాలు:

చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్ – క్రైమ్ నంబర్ 108/2026, సెక్షన్ 309(4) R/w 3(5) BNS: తేదీ 17.10.2026 రాత్రి సుమారు 11:10 గంటల సమయంలో చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-65 జాతీయ రహదారిపై రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారులోని వ్యక్తులను నిందితులు నకిలీ తుపాకీ, కత్తులతో బెదిరించి రెండు బంగారు గాజులు, బంగారు పుస్తెల తాడు, బంగారు మరియు డైమండ్ నెక్లెస్, ఉంగరం, రూ.2,500 నగదును దోచుకున్నారు.

సదాశివపేట పోలీస్ స్టేషన్ – క్రైమ్ నంబర్ 580/2026, సెక్షన్ 309(4) BNS: తేదీ 25.10.2026 అర్ధరాత్రి సుమారు 2:00 గంటల సమయంలో సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-65 జాతీయ రహదారిపై ఆరూరు గ్రామ శివారులో నిలిపి ఉంచిన కారులోని వ్యక్తులను బెదిరించి బంగారు ఆభరణాలు, నగదును దోచుకున్నారు.

కోహీర్ పోలీస్ స్టేషన్ – క్రైమ్ నంబర్ 173/2026, సెక్షన్ 309(4) R/w 3(5) BNS: తేదీ 25.10.2026 అర్ధరాత్రి అందాజ 3:20గంటల సమయంలో మరో కారును లక్ష్యంగా చేసుకొని అందులోని వ్యక్తులను ఆయుధాలతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదును దోచుకొని పారిపోయారు.

కర్ణాటక రాష్ట్రం:

4. హుమ్నాబాద్ పోలీస్ స్టేషన్ – బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం: తేదీ 22/23.10.2026 అర్ధరాత్రి హుమ్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇదే తరహాలో దారి దోపిడీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

నేరాలకు పాల్పడిన విధానం:

మహారాష్ట్ర రాష్ట్రంలోని లాతూర్, పూణే, బారామతి ప్రాంతాలకు చెందిన నిందితులు ఒక ముఠాగా ఏర్పడి రాత్రి సమయాల్లో జాతీయ రహదారులపై వెళుతూ, అత్యవసరాలకై రోడ్డు పక్కన ఒంటరిగా నిలిపి ఉంచిన కార్లను లక్ష్యంగా చేసుకొని, తమ ద్విచక్ర వాహనాన్ని కొంత దూరంలో నిలిపి, ముఖాలు గుర్తుపట్టకుండా మంకీ క్యాప్‌లు ధరించి కార్ల వద్దకు వెళ్లేవారు.

తమ వెంట తెచ్చుకున్న నకిలీ తుపాకీ, కత్తులతో కార్లలో ఉన్న వ్యక్తులను బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదును బలవంతంగా దోచుకునేవారు. అనంతరం ద్విచక్ర వాహనంపై మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి పారిపోయి, దోచుకున్న బంగారు ఆభరణాలను తమకు పరిచయమున్న వ్యక్తి ద్వారా లాతూర్‌లోని బంగారు దుకాణంలో విక్రయించి, వచ్చిన డబ్బులను పంచుకునేవారు.

నిందితుల అరెస్ట్:

నిందితులు మరోసారి తెలంగాణ రాష్ట్రంలో దారి దోపిడీలకు పాల్పడేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. అందులో భాగంగా ముగ్గురు నేరస్తులు నేరం చేయడానికై మహారాష్ట్ర నుంచి యమహా బ్ల్యూ కలర్ నెంబర్ ప్లేట్ లేని బైక్ పై బయలుదేరి నల్లని మాస్క్, స్వెట్టర్ లు, 2-కత్తులు బ్యాగ్ లో పెట్టుకొని, మరో వ్యక్తి ఎయిర్ పిస్టల్ ను కనబడకుండా దాచి పెట్టుకొని.

తెలంగాణ వైపు వస్తుండగా, చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాడ్గి చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని యమహా బ్ల్యూ కలర్ ఆర్ 15 బైక్ పై అనుమానాస్పదంగా కనిపించడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, సంగారెడ్డి జిల్లాలో జరిగిన మూడు దారి దోపిడీ కేసులతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని హుమ్నాబాద్‌లో జరిగిన మరో దారి దోపిడీ కేసులో తమ ప్రమేయాన్ని వెల్లడించారు.

నిందితుల పూర్తి వివరాలు:

A1. హసన్ సమీర్ షేక్ @ హసన్ జమీర్ షేక్ (32): తండ్రి జమీర్ దస్తగిర్ షేక్. మహారాష్ట్రలోని పూణే జిల్లా బారామతి తాలూకా తాండూల్వాడి ప్రాంతంలో చికెన్ సెంటర్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. స్వస్థలం లాతూర్ జిల్లా చాకూర్ తాలూకా నాలేగావ్ గ్రామం.

A2. సంతోష్ సెగర్ ధగుడు (35): తండ్రి బాపు ధగుడు. మహారాష్ట్రలోని పూణే జిల్లా ఇందాపూర్ తాలూకా గొథండి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ.

A3. నౌషాద్ జాకీర్ సయ్యద్ @ నౌషాద్ (24): తండ్రి జాకీర్ హుస్సేన్ సయ్యద్. ప్రస్తుతం పూణే జిల్లా ఇందాపూర్ తాలూకా లోణి గ్రామంలో NH-65 అండర్ బ్రిడ్జి సమీపంలో నివాసం ఉంటూ ఆయిల్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. స్వస్థలం సోలాపూర్ జిల్లా కర్మాలా తాలూకా చికల్తాన్ గ్రామం.

A4. రఫీక్ షంషోద్దీన్ షేక్ (28): తండ్రి షంషోద్దీన్ షేక్. మహారాష్ట్రలోని లాతూర్ పట్టణం, మాణిక్రావ్ జాదవ్ నగర్, ఖడ్గావ్ రోడ్డుకు చెందినవాడు. (పరారీలో ఉన్నాడు).

ప్రస్తుతం అరెస్టయిన A1 నుంచి A3 వరకు నిందితులు విచారణలో జాతీయ రహదారి NH-65 పై చేసిన నాలుగు దారి దోపిడీ కేసుల్లో తమ ప్రమేయాన్ని వెల్లడించారు. పరారీలో ఉన్న A4 రఫీక్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

1. నేరాలకు ఉపయోగించిన నీలం రంగు యమహా R15 V3 ద్విచక్ర వాహనం (నంబర్ ప్లేట్ లేనిది).

2. ఒక నకిలీ ఎయిర్ పిస్టల్ (స్ప్రింగ్ యాక్షన్).

3. ఒక కొబ్బరి బొండం నరికే కత్తి.

4. చెక్క పిడితో ఉన్న మరో కత్తి.

5. రెండు నల్లని క్యాప్‌లు.

6. మూడు స్వెట్టర్లు.

7. ఒక బ్యాగ్.

8. రెండు ఆధార్ కార్డులు.

9. మూడు సెల్‌ఫోన్లు.

ద్విచక్ర వాహనం వివరాలు:

• ఛాసిస్ నంబర్: ME1RG671CL0061905

• ఇంజిన్ నంబర్: G3N4E0093349

నిందితులు దోచుకున్న బంగారు ఆభరణాలను మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. వాటి విక్రయానికి సహకరించిన వ్యక్తి, బంగారు దుకాణం వివరాలపై దర్యాప్తు కొనసాగుతుంది.

రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేసే వారికి జిల్లా ఎస్పీ గారి సూచనలు: ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలను నిలిపి ఉంచరాదు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను నిలిపి ఉంచాల్సి వస్తే పెట్రోల్ బంకులు, ధాబాలు, హోటళ్లు వంటి జనసంచారం ఉండే సురక్షిత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలి.

వాహనాలు బ్రేక్‌డౌన్, టైర్ పంక్చర్ లేదా ఇతర అత్యవసర సహాయం అవసరమైనప్పుడు వెంటనే డయల్ 112 లేదా జాతీయ రహదారి పెట్రోలింగ్ టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలి. వీలైనంత వరకు జనసంచారం ఉన్న, వెలుతురు ఉండే సురక్షిత ప్రాంతాల్లోనే వాహనాలను నిలిపి ఉంచాలి.

నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

ఈ కేసులను ఛేదించడంలో సమర్థవంతంగా పనిచేసిన సీసీఎస్, జహీరాబాద్ సబ్ డివిజన్, సదాశివపేట పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy