Sangareddy: సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి!

Sangareddy: సంగారెడ్డి నియోజకవర్గ ప్రజా సమస్యలపై కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. సింగూర్ నీరు, రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లపై సుదీర్ఘ చర్చ.

SRIKANTH, SANGAREDY
Published on: 29 Oct 2026 5:40 PM IST
Sangareddy
X

Sangareddy: సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి!

సంగారెడ్డి: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి, దాని ప్రభావంతో ప్రజలకు, రైతులకు కలిగే నష్టాలను ముందుగానే అరికట్టేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కోరారు.

సంగారెడ్డి నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు, తాగునీరు, సాగునీరు, రహదారులు, విద్యుత్, సంక్షేమ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చించారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పలు సమస్యలపై ప్రజలను నేరుగా కలెక్టర్‌ వద్దకు తీసుకెళ్లి, వారి ఇబ్బందులను వివరించారు.

సింగూర్ ప్రాజెక్టు నీటి నిర్వహణలో ముందస్తు ప్రణాళిక, దూరదృష్టి లోపించడం వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్రమైన తాగునీటి సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌నినో పరిస్థితుల ప్రభావం ఉంటుందని తెలిసినప్పటికీ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని వినియోగించడంలో తగిన ప్రణాళికలు రూపొందించలేదని అన్నారు.

సముద్రాలపై వంతెనలు నిర్మించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ప్రస్తుత కాలంలో, సింగూర్ ఆనకట్ట రివెట్‌మెంట్‌ మరమ్మతుల కోసం ప్రత్యామ్నాయ ఆధునిక సాంకేతిక పద్ధతులను ఎందుకు వినియోగించలేదని అన్నారు.

హనుమాన్ నగర్, చేర్యాల, ఆరుట్ల, బ్యాతల్ గ్రామాలకు సంబంధించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని కోరారు. ఇళ్ల నిర్మాణం కోసం స్థలం ఇచ్చిన వారికి లబ్ధిదారుల ఎంపికలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా పూర్తికాని ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నిధులు మంజూరు చేసి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట కొత్త బోర్లు వేయడంతోపాటు ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కింద సరఫరా అవుతున్న విద్యుత్‌తో వ్యవసాయ బోర్ల ద్వారా తోడుతున్న నీటిని బీర్ ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రస్తావించారు. అంశాలపై సంబంధిత అధికారులు విచారణ జరపాలని కోరారు. బీర్ ఫ్యాక్టరీలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే వర్తించే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బొబ్బిలిగామ, ఏటిగడ్డ సంఘం, మాలపాడు గ్రామాల మీదుగా వెళ్లే రహదారులు పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రహదారులకు కనీసం వెట్‌మిక్స్‌తోనైనా తక్షణ మరమ్మతులు చేపట్టి ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.

అలాగే రేజింతల్ రోడ్డు, అనంతసాగర్ నుంచి సైదాపూర్ రోడ్డు, సిద్దాపూర్ నుంచి మారేపల్లి రోడ్డు సహా నియోజకవర్గంలోని పలు రహదారులు అధ్వానంగా మారాయని వివరించారు. గుంతలు, గతుకులతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నందున సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, దెబ్బతిన్న రహదారులను గుర్తించాలని కోరారు. వెట్‌మిక్స్, అవసరమైన ఇతర మరమ్మతు పనులు చేపట్టి రహదారులను ప్రయాణానికి అనువుగా మార్చాలని సూచించారు.

సంగారెడ్డి నుంచి మదీనాగూడ వరకు జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. అక్టోబర్‌లోగా పూర్తికావాల్సిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, పనుల్లో జాప్యానికి కారణాలను గుర్తించి, నిర్మాణ పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు..

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా గత ఏడాదికి సంబంధించిన సన్న వడ్ల బోనస్‌ కింద రైతులకు చెల్లించాల్సిన రూ.500 బకాయిలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అర్హులైన రైతులకు బకాయిలను త్వరితగతిన చెల్లించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, నాణ్యమైన విద్యుత్ అందక వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని, పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కుల పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా పెండింగ్‌లో ఉన్న చెక్కులను త్వరితగతిన పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంగారెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 823 ప్రతిపాదనలు సమర్పించగా, ఇప్పటివరకు 207 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన 616 ఇళ్లను కూడా అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేసి పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చాలని కలెక్టర్‌ను కోరారు.

నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా తొమ్మిది ఎస్సీ కమ్యూనిటీ భవనాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. ఈ భవనాల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వి.బి.-జి. రామ్‌జీ పథకం కింద నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఎమ్మెల్యే సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన పనులను గుర్తించి, నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, గృహ నిర్మాణాలు, రైతుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన అంశాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు ఎమ్మెల్యే వివరించారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుని, వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, పూర్తికాని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు.

SRIKANTH, SANGAREDY

SRIKANTH, SANGAREDY