Sangareddy: 684 టన్నుల ఏకశిల నందీశ్వర విగ్రహ పనులు ప్రారంభం

Sangareddy: సంగారెడ్డి ఫసల్‌వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో రూ.9 కోట్లతో నిర్మించనున్న 684 టన్నుల ఏకశిల నందీశ్వర విగ్రహ పనులను జగ్గారెడ్డి, నిర్మల ప్రారంభించారు.

Srinivas K, Sangareddy
Published on: 16 Nov 2026 8:41 PM IST
Sangareddy
X

Sangareddy: 684 టన్నుల ఏకశిల నందీశ్వర విగ్రహ పనులు ప్రారంభం

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మరో అపూర్వ ఆధ్యాత్మిక నిర్మాణానికి వేదికగా నిలుస్తోంది. విద్యాపీఠం ప్రాంగణంలో నిర్మితమవుతున్న అరుదైన శ్రీ కైలాస ప్రస్తార మహామేరులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేర్కొంటున్న సువర్ణ శృంగ నందీశ్వర స్వామి ఏకశిలా విగ్రహ నిర్మాణానికి సోమవారం శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, టీజీఐఐసీ మాజీ చైర్‌పర్సన్ నిర్మల పాల్గొన్నారు. భారీ ఏకశిలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ విగ్రహ నిర్మాణం కోసం సంగారెడ్డి సమీపంలోని ఎర్దనూర్ గుట్టల నుంచి 684 టన్నుల బరువున్న భారీ ఏకశిలను సేకరించారు. 32 అడుగుల పొడవు, 19.5 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పు కలిగిన ఈ అరుదైన శిలతో భారీ నందీశ్వర స్వామి విగ్రహాన్ని రూపొందించనున్నారు. ఈ ఏకశిలను 284 చక్రాలు కలిగిన ప్రత్యేక భారీ వాహనం ద్వారా త్వరలో ఫసల్‌వాది విద్యాపీఠానికి తరలించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఫసల్‌వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి చేపట్టిన ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమం సంగారెడ్డి ప్రాంతానికి గర్వకారణమని కొనియాడారు. ప్రత్యేక గుర్తింపు పొందేలా ఇంతటి భారీ నందీశ్వర స్వామి విగ్రహాన్ని నిర్మించాలనే సంకల్పం అభినందనీయమన్నారు. ఈ మహాక్రతువు వెనుక మహేశ్వర శర్మ సిద్ధాంతి కృషి, పట్టుదల, ఆధ్యాత్మిక సంకల్పం ఉన్నాయని ప్రశంసించారు.

ఈ మహాక్రతువులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక నిర్మాణం పూర్తికావాలంటే అందరి సహకారం అవసరమన్నారు. ఆర్థికంగా ఎవరికి తోచినంత వారు సహాయం అందించి ఈ మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు. ప్రజలు, భక్తులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ఆధ్యాత్మిక కార్యసాధనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

తాను కూడా వ్యక్తిగతంగా ఈ మహాక్రతువులో భాగస్వామినవుతానని జగ్గారెడ్డి ప్రకటించారు. మహేశ్వర శర్మ సిద్ధాంతి చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఆశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అవసరమైన నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.

ఇంతటి విశిష్టమైన ఆధ్యాత్మిక నిర్మాణం పూర్తయితే ఫసల్‌వాది దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని జగ్గారెడ్డి ఆకాంక్షించారు.

అంతకుముందు విద్యాపీఠ వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణ విశిష్టతను, శ్రీ కైలాస ప్రస్తార మహామేరు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరించారు. ఇంతటి భారీ ఏకశిలను గుర్తించి, దానితో నందీశ్వర స్వామి విగ్రహాన్ని నిర్మించేందుకు సంకల్పించడం అరుదైన విషయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, పలువురు కాంగ్రెస్ నాయకులు, విద్యాపీఠ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy