Sangareddy: గుండ్ల మాచనూర్లో తెలంగాణ తొలి బతుకమ్మ ఘాట్ ప్రారంభం!
Sangareddy: సంగారెడ్డి జిల్లా గుండ్ల మాచనూర్లో రూ.2 కోట్లతో నిర్మించిన రాష్ట్ర తొలి బతుకమ్మ ఘాట్ను మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. స్థానికులకే ఉపాధి ఇవ్వాలని స్పష్టం చేశారు.
Sangareddy: గుండ్ల మాచనూర్లో తెలంగాణ తొలి బతుకమ్మ ఘాట్ ప్రారంభం!
సంగారెడ్డి జిల్లా హత్నూర: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచనూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి శ్రీకారం చుట్టారు. హానర్ ల్యాబ్ ఫార్మా కంపెనీ సౌజన్యంతో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్, అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, పూర్తయిన పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణలోనే మొట్టమొదటి బతుకమ్మ ఘాట్ను గుండ్ల మాచనూర్ గ్రామంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులను ప్రతి గ్రామానికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అందేలా చూడాలని అన్నారు.
ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల సంక్షేమానికి పెన్షన్ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం విషయంలో పరిశ్రమలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. గుండ్ల మాచనూర్ గ్రామంలో క్రీడాకారులకు ఉపయోగపడేలా అతి త్వరలో స్టేడియం ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అప్పుడే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన అన్ని విధాలా సహకారం అందిస్తోందని మంత్రి తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన అల్పాహారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏలినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా, వివిధ దేశాల్లోనూ, రాష్ట్రాల్లోనూ ఎక్కువగా ఉందని మంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుండ్ల మాచనూర్లో బతుకమ్మ ఘాట్, అంగన్వాడీ కేంద్రం ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో గ్రామంలో అభివృద్ధిపై ఆశలు చిగురించాయి.




