Hathnoora: సిరిపురలో ధాన్యం కొనుగోళ్ల కోసం రైతుల ధర్నా, రాస్తారోకో
Hathnoora: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సిరిపుర గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
Hathnoora: సిరిపురలో ధాన్యం కొనుగోళ్ల కోసం రైతుల ధర్నా, రాస్తారోకో
హత్నూర: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సిరిపుర గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తేమశాతం నిబంధనల పేరుతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో పదేపదే ధాన్యాన్ని ఆరబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోయారు.
మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో ఇదే అదునుగా భావిస్తున్న దళారులు తక్కువ ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను నష్టాలపాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ తమ పంటను విక్రయించుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి సిరిపుర ధాన్యం కొనుగోలు కేంద్రంలో వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు.
రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై శ్రీధర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని నచ్చజెప్పడంతో రైతులు ధర్నా, రాస్తారోకోను విరమించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సిరిపుర రైతులు కోరుతున్నారు.




