Sangareddy: కాంగ్రెస్ అండతో పోలీసుల కక్షసాధింపు ఎస్పీకి చంటి క్రాంతి కిరణ్ ఫిర్యాదు!

Sangareddy: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఒత్తిళ్లతో పోలీసులు అక్రమ కేసులు బనాయಿಸುತ್ತారని ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఫిర్యాదు చేశారు.

UMASHANKAR, ANDOLE
Published on: 15 Oct 2026 9:08 PM IST
Sangareddy
X

Sangareddy: కాంగ్రెస్ అండతో పోలీసుల కక్షసాధింపు ఎస్పీకి చంటి క్రాంతి కిరణ్ ఫిర్యాదు!

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, సామాన్య రైతులపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసుల పక్షపాత వైఖరి, కక్షసాధింపు చర్యలపై సంగారెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) గారికి గురువారం అధికారికంగా ఫిర్యాదు లేఖను అందజేశారు.

ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అక్రమ చర్యలను ఎండగట్టారు. జోగిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పరిధిలో బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని అకారణంగా కేసులు పెడుతున్నారు. కన్సన్‌పల్లి మాణిక్ రెడ్డి, ఎర్రారం ప్రవీణ్ రెడ్డి, తడ్కనూర్ సర్పంచ్ అనిల్ రెడ్డి తదితరులపై అక్రమంగా కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు.

అంతేకాకుండా కార్యకర్తలను అనధికారికంగా పోలీస్ స్టేషన్లకు పిలిపించి, గంటల తరబడి కూర్చోబెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు. "బీఆర్ఎస్‌లో ఉండి ఏం చేస్తారు? అధికార కాంగ్రెస్ పార్టీలో చేరండి" అంటూ పోలీసులు బాహాటంగా రాజకీయ సలహాలు ఇవ్వడం ఏ చట్టంలో ఉందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే తిరిగి వారిపైనే కౌంటర్ కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారని మండిపడ్డారు.

అక్రమ కేసులు – అరెస్టుల వివరాలు :

* జోగిపేట: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడనే నెపంతో నవీన్ రెడ్డి అనే కార్యకర్తపై జోగిపేట పీఎస్‌లో తప్పుడు కేసు పెట్టారు. అలాగే అశోక్ అనే వ్యక్తిని సివిల్ దుస్తుల్లో వచ్చి అక్రమంగా నిర్బంధించి, నిలదీసేసరికి చివరకు జహీరాబాద్ స్టేషన్‌లో అరెస్ట్ చూపించారు.

* వట్పల్లి మండలం: మేడికుంద గ్రామానికి చెందిన అశోక్ కుమార్, దేవానూర్ గ్రామానికి చిన్నలపై సంబంధం లేని మూడో వ్యక్తితో సోషల్ మీడియా నెపంతో తప్పుడు కేసులు పెట్టించారు. నిర్ణేప్ల గ్రామంలో గ్రామ కంఠం స్థలంలో గుడి కట్టాలని పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేస్తే, కబ్జా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు సంగయ్య, కృష్ణ, నీలయ్య, వీరారెడ్డి, హన్మంతు, గోపాల్‌లపై అక్రమ కేసులు బనాయించారు.

బిజిల్‌పూర్‌లో దళితబంధు లబ్ధిదారుడు సదానందం ఉపాధి పొందుతుంటే జేసీబీని సీజ్ చేసి వేధించారు. వట్పల్లిలో పోలింగ్ రోజున కాంగ్రెస్ నాయకులు బాధితుల ఇళ్లపై దాడి చేస్తే, ఫలితాల తర్వాత మారుతి, బాలాజీ, కిషన్, మహేందర్ గౌడ్‌లపైనే ఎదురు కేసులు పెట్టారు. అలాగే పొలంలో మట్టి తవ్వుకున్నందుకు మాడు అనే రైతుపై కేసు నమోదు చేశారు.

* మునిపల్లి మండలం: మగ్దంపల్లిలో మునీరుద్దీన్, ఎండీ ఏజాజ్, ఎండీ ఇంతియాజ్‌లపై రాజకీయ కక్షతో కేసులు నమోదు చేశారు. ఖమ్మంపల్లిలో తుడుం దుర్గయ్య, తుడుం సుభాష్‌లపై కేసులు పెట్టడమే కాకుండా, తాగునీటి బోరు పాయింట్ వేయించి గ్రామాభివృద్ధికి కృషి చేసిన జడ్పీటీసీ భర్త పైతర సాయికుమార్‌పై కక్షపూరితంగా అక్రమ రౌడీషీట్ తెరిచారు.

మల్లారెడ్డిపేట్‌లో పొలాల్లోకి మట్టి తరలిస్తున్న వార్డు మెంబర్ సంతోష్ రెడ్డి, మోహన్, ఈశ్వర్ రెడ్డిలపై అక్రమ కేసులు పెట్టారు. గ్రామీణ రోడ్లు పాడవుతున్నాయని భారీ వాహనాలను ప్రధాన రహదారి గుండా వెళ్లాలని కోరినందుకు ఎస్సీల ఇళ్లపై దుండగులు దాడి చేయగా, బాధితులైన సర్పంచ్ ఈర్లపల్లి రాజు, ఉప సర్పంచ్ ప్రేమ్ కుమార్, మహిపాల్, గంగారం, బంటు సురేష్‌లపైనే ఎదురు కేసులు బనాయించారు.

బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ఎల్లప్పుడూ చట్టానికి లోబడే పనిచేస్తున్నారని, భవిష్యత్తులోనూ ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. అయితే పోలీసు యంత్రాంగం అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలా మారి ఈ విధమైన అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.వెంటనే జిల్లా ఎస్పీ గారు జోక్యం చేసుకుని ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే న్యాయం చేస్తానని ఎస్ పి హామీ ఇచ్చారు.

అయితే ఉన్నతాధికారితో అన్ని కేసులపై సమగ్ర నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రజాప్రతినిధులపై బనాయించిన అక్రమ కేసులను, సాయికుమార్‌పై తెరిచిన అక్రమ రౌడీషీట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE