Sangareddy: ఘనంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు..

Sangareddy: సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఘనంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు. స్వామి వివేకానందుని ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ పాండు పిలుపు.

Srinivas K, Sangareddy
Published on: 29 Oct 2026 8:05 PM IST
Sangareddy
X

Sangareddy: ఘనంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు..

సంగారెడ్డి: యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ పాండు అన్నారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి కలెక్టరేట్‌లోని ఆడిటోరియం లో జిల్లా స్థాయి యువజనోత్సవాలను ఘనంగా ఉత్సాహ భరితంగా జరిగాయి .

ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ పాండు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో సుమారు 400 మంది యువ కళాకారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, స్వామి వివేకానందుడు యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తిని పెంపొందించేందుకు చేసిన బోధనలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. వివేకానందుడు 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో అమెరికా సోదరీమణులారా, సోదరులారా అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు. యువత తమలోని ప్రతిభను వెలికితీసి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలన్నారు. యువజనోత్సవాలు యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు చక్కని వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఇలాంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. స్వామి వివేకానందుని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, సమాజ సేవతో పాటు దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో భాగంగా జానపద నృత్యం, జానపద గేయం, వీధి నాటకం, తదితర కళాంశాల్లో పోటీలు నిర్వహించారు. 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు తమ ప్రతిభను ప్రదర్శించారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు, అక్కడ ప్రథమ స్థానం పొందిన వారు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారని అధికారులు తెలిపారు.

వచ్చే జనవరిలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనేందుకు యువత తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి సంబంధిత అధికారులు, యువ కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy