Sangareddy: వ్యవసాయ బోర్ల నుంచి పరిశ్రమలకు నీటి తరలింపుపై చర్యలేవి?

Sangareddy: వ్యవసాయ బోర్ల నుంచి పరిశ్రమలకు అక్రమంగా నీటిని తరలిస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రుల సమీక్షా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

SRIKANTH, SANGAREDY
Published on: 27 Oct 2026 4:44 PM IST
Sangareddy
X

Sangareddy: వ్యవసాయ బోర్ల నుంచి పరిశ్రమలకు నీటి తరలింపుపై చర్యలేవి?

సంగారెడ్డి: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి, భవిష్యత్తులో నీటి వనరులపై ఒత్తిడి పెరిగే అవకాశమున్న నేపథ్యంలో తాగునీటి సమస్యను ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు వ్యవసాయ బోర్ల నుంచి నీటిని ట్యాంకర్ల ద్వారా పరిశ్రమలకు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సరఫరా, వ్యవసాయ బోర్ల వినియోగం, పరిశ్రమలకు నీటి తరలింపు, భూసేకరణ పరిహారం వంటి అంశాలను సమీక్షలో చర్చించారు…

ప్రజల దాహార్తిని తీర్చడానికి సరిపడా నీరు లేదని చెబుతున్న అధికారులు, గ్రామాల పరిధిలోని వ్యవసాయ బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా పరిశ్రమలకు నిరంతరాయంగా నీటిని తరలిస్తున్న వ్యవహారంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యవసాయ విద్యుత్‌ను వినియోగించుకుంటూ బోర్ల నుంచి నీటిని తోడిపోసి ట్యాంకర్లను నింపుతున్నారని, ఈ వ్యవహారం అధికారులకు తెలిసే జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.

వ్యవసాయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన బోర్ల నీటిని ఇతర అవసరాలకు పెద్దఎత్తున తరలిస్తే భూగర్భ జలమట్టాలు మరింత పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి అవసరాలను పక్కనపెట్టి పరిశ్రమలకు నీటిని సరఫరా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా నీటిని తరలిస్తున్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సంగారెడ్డి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత ఏర్పడకుండా ప్రత్యామ్నాయ వనరులను గుర్తించాలని, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, నీటి వినియోగంపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కోరారు.

లేదంటే ఖాళీ కడవాలతో రోడ్లపైకి వస్తారని హెచ్చరించారు…

పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ చేపట్టిన మునిదేవునిపల్లి ప్రాంతంలో కొందరు రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆరోపించారు. భూముల సేకరణ, పరిహారం పంపిణీ విషయంలో రెవెన్యూ అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. దళారులు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ఇబ్బందులు పెడతామంటూ బెదిరించి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు.

భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, పరిహారం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూసేకరణకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, పరిహారం అందని రైతులను గుర్తించి న్యాయం చేయాలని కోరారు.

ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్న చింత ప్రభాకర్, నీటి సమస్యను రాజకీయ అంశంగా కాకుండా ప్రజల జీవనాధారానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమస్యగా పరిగణించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని, నీటి వనరుల దుర్వినియోగాన్ని అరికట్టి ప్రజలకు సకాలంలో తాగునీరు అందించేలా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

SRIKANTH, SANGAREDY

SRIKANTH, SANGAREDY