Andole: ట్రాక్టర్ కింద పడి ఏడేళ్ల చిన్నారి మృతి: డాకూర్‌లో విషాదం!

Andole: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామంలో ట్రాక్టర్ ఢీకొని కర్ణాటకకు చెందిన పత్తి కూలీల ఏడేళ్ల కుమార్తె శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది.

UMASHANKAR, ANDOLE
Published on: 29 Oct 2026 9:16 PM IST
Andole
X

Andole: ట్రాక్టర్ కింద పడి ఏడేళ్ల చిన్నారి మృతి: డాకూర్‌లో విషాదం!

ఆందోల్, అక్టోబర్ 29: పొట్టకూటి కోసం వలస వచ్చిన కూలీల కుటుంబంలో ఒకే ఒక్క ప్రమాదం కోలుకోలేని తీవ్ర విషాదాన్ని నింపింది. ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఏడేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక సంఘటన ఆందోల్ మండలం డాకూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొన్ని వలస కూలీల కుటుంబాలు బతుకుదెరువు కోసం ఆందోల్ మండలం డాకూర్ గ్రామానికి పత్తి ఏరడానికి (తీయడానికి) వచ్చాయి. రోజంతా చేనులో పత్తి తీసే పని ముగించుకుని, గురువారం రాత్రి తాము సేకరించిన పత్తిని తీసుకుని నివాసం ఉంటున్న ప్రాంతానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో కూలీల కుటుంబానికి చెందిన శ్రావణి (7) అనే చిన్నారి ఆడుకుంటూ అక్కడ ఆపి ఉంచిన ట్రాక్టర్ వైపు వెళ్ళింది. అయితే, చీకటిగా ఉండటంతో డ్రైవర్ చిన్నారిని గమనించకుండా ఒక్కసారిగా ట్రాక్టర్‌ను ముందుకు తీశాడు. దీంతో ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో చిన్నారి శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది.

కళ్లెదుటే చిన్నారి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి, కన్నవారు మరియు తోటి వలస కూలీలు బోరున విలపించారు. వారి ఆక్రందనలు స్థానికులను తీవ్రంగా చలించిపోయేలా చేశాయి. సమాచారం అందుకున్న అందోల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE