Jogipet: జనావాసాల మధ్య స్మశానాలు.. ఇందిరా నగర్ వాసుల నరకయాతన!
Jogipet: అందోల్-జోగిపేట మున్సిపాలిటీ 2వ వార్డు ఇందిరా నగర్లో జనావాసాల మధ్య స్మశాన వాటికలతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Jogipet: జనావాసాల మధ్య స్మశానాలు.. ఇందిరా నగర్ వాసుల నరకయాతన!
Jogipet: సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు ఇందిరా నగర్ కాలనీ నివాసితులు నిత్యం భయాందోళనల మధ్య కాలం వెల్లదీస్తున్నారు. కాలనీ నడిబొడ్డున నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండు స్మశాన వాటికల వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల మధ్యలోనే అంత్యక్రియలు నిర్వహిస్తుండటంతో కంటినిండా నిద్రపోలేకపోతున్నామని, ప్రశాంతంగా గాలి పీల్చుకోలేకపోతున్నామని కాలనీ మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులు, మున్సిపల్ పాలకుల నిర్లక్ష్యంపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాలనీ రోడ్డుపై అంత్యక్రియలకు సంబంధిచిన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వాహనదారులకు, కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుంది.ఇళ్ల మధ్యలోనే శవాల అంత్యక్రియలు,దహన సంస్కారాలు జరుగుతుండటంతో చిన్న పిల్లలు తీవ్ర భయబ్రాంతులకు లోనవుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావడానికి కాలనీ మహిళలు, ప్రజలు జంకుతున్నారు.జనావాసాలు ఉండే కాలనీ మధ్యలో శవాలను పూడ్చిపెట్టడం లేదా దహనం చేయడం చట్టవిరుద్ధం, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హానికరం. ఇళ్ల మధ్య ఇలా చేయడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవ్వడమే కాకుండా, అనేక అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.
రక్షణ గోడలు లేవు.. అసాంఘిక కార్యకలాపాలు:
ఈ స్మశాన వాటికల చుట్టూ సరైన ప్రహరీ గోడలు (రక్షణ గోడలు) లేకపోవడంతో పిచ్చి మొక్కలు, పొదలు పెరిగిపోయాయి. ఇవి విషసర్పాలకు నిలయంగా మారడమే కాకుండా, రాత్రి వేళల్లో కొందరు మందుబాబులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వినతులు ఇచ్చినా ‘నిమ్మకు నీరెత్తినట్లు’ అధికారులు:
వార్డులో ఉన్న ఈ తీవ్రమైన సమస్యపై ఇందిరా నగర్ కాలనీ ప్రతినిధులు, స్థానికులు మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించారు . జనావాసాలు పెరిగినందున ఈ స్మశాన వాటికలను పట్టణ శివార్లకు తరలించాలని లేదా ఆధునిక (వైకుంఠ ధామం) పద్ధతిలో కాలుష్యం రాకుండా గ్యాస్/ఎలక్ట్రికల్ పద్ధతులు ప్రవేశపెట్టి చుట్టూ ఎత్తైన గోడలు నిర్మించాలని కోరారు. అయినా మున్సిపల్ అధికారులు కేవలం "పరిశీలిస్తాం" అనే సాకులతో కాలయాపన చేస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో శాశ్వత పరిష్కారం చూపడం లేదని కాలనీవాసులు మండిపడుతున్నారు.
కాలనీవాసుల హెచ్చరిక:
సాక్షాత్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా నియోజకవర్గ కేంద్రమైన అందోల్-జోగిపేట మున్సిపాలిటీలోని 2వ వార్డులో ఇంతటి దారుణమైన పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని స్థానికులు అంటున్నారు. ఇందిరా నగర్ కాలనీ మధ్యలో ఉన్న స్మశాన వాటికల సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాళ్లని కాలనీ వాసులు కోరారు.




