Medak: అవుసులపల్లిలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం!
Medak: మెదక్ జిల్లా అవుసులపల్లిలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. 90 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టి 75 వాహనాలు స్వాధీనం చేసుకున్న అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్.
Medak: అవుసులపల్లిలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం!
Medak: జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుసులపల్లి వార్డు లో శనివారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో 90 మంది పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 69 ద్విచక్ర వాహనాలు, రెండు బొలెరో వాహనాలు, నాలుగు ఆటోలను కలిపి మొత్తం 75 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు ఖాతాల వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల మరణాలకు హెల్మెట్ ధరించకపోవడం ప్రధాన కారణాల్లో ఒకటని పేర్కొన్నారు. ప్రయాణం చిన్నదైనా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, స్ట్రాప్‌ను బిగించుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
మహిళలు, బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు బాలిక అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్నా పోక్సో చట్టం కింద నేరమేనని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
అత్యవసర సమయాల్లో పోలీసుల సహాయం కోసం డయల్ 112కు కాల్ చేయాలని, ఆ సేవలను అనవసరంగా దుర్వినియోగం చేయవద్దని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీఐపీఓ ఏఎస్ఐ విఠల్ సేవలు అందిస్తారని తెలిపారు.
నార్కోటిక్ డాగ్ జూబి సహాయంతో ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాల ఉనికిని గుర్తించేందుకు తనిఖీలు నిర్వహించారు. ఫింగర్‌ప్రింట్ పరికరం ద్వారా వేలిముద్రలను పరిశీలించి పాత నేరస్థుల వివరాలను గుర్తించే ప్రక్రియ చేపట్టారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించడం పోలీసుల ఉద్దేశం కాదని, ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, కృష్ణమూర్తి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




