Narsapur: నర్సాపూర్‌లో పోక్సో చట్టంపై విద్యార్థులకు సదస్సు
Narsapur: నర్సాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
Narsapur: నర్సాపూర్‌లో పోక్సో చట్టంపై విద్యార్థులకు సదస్సు
నర్సాపూర్: బాలల భద్రత, హక్కుల పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా నర్సాపూర్‌లో పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.* బాలికలు, బాలుర పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక నేరాలకు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన శిక్షలు తప్పవని సీనియర్ న్యాయవాది సి.హెచ్. స్వరూపరాణి స్పష్టం చేశారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయమూర్తి ఎం. హేమలత ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ఉదయం నర్సాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రార్థనా సమయంలో విద్యార్థులకు పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ న్యాయవాది, లీగల్ సర్వీసెస్ మాజీ కౌన్సిల్ న్యాయవాది సి.హెచ్. స్వరూపరాణి మాట్లాడుతూ.. 18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం నేర తీవ్రతను బట్టి కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని వివరించారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులు, దాడులను ఏమాత్రం ఉపేక్షించరాదని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
బాలలపై అఘాయిత్యాలు, లైంగిక నేరాలు జరిగినట్లు తెలిసినప్పుడు వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆమె తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత చట్ట ప్రకారం విచారణ చేపట్టి, నేరం నిరూపితమైతే న్యాయస్థానం ద్వారా శిక్షలు విధించబడతాయని వివరించారు.
*పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత*
విద్యార్థులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, చెడు మార్గాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో జీవించాలని స్వరూపరాణి సూచించారు. చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, పట్టుదలతో విద్యనభ్యసిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బాలల భద్రత, గౌరవం, హక్కులను కాపాడటంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సామ్య నాయక్, ఉపాధ్యాయులు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.




