Patancheru: రాష్ట్ర స్థాయి క్రీడలకు పటాన్చెరు కేంద్రం
Patancheru: పటాన్చెరులో 70వ స్కూల్ గేమ్స్ అండర్-17 రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. బందోబస్తు విషయంలో పోలీసు వైఫల్యాన్ని విమర్శించారు.
Patancheru: రాష్ట్ర స్థాయి క్రీడలకు పటాన్చెరు కేంద్రం
పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గ కేంద్రాన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థి దైనందిన జీవితంలో క్రీడలు భాగం కావాలని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల అలవడతాయని పేర్కొన్నారు.
పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో నిర్వహిస్తున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాలబాలికల రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలను గురువారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణితో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు చెందిన 200 మందికి పైగా క్రీడాకారులు పోటీలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హాజరైన క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. క్రీడాకారులకు అవసరమైన మైదానాలు, వసతులు, ఇతర సౌకర్యాలను కల్పిస్తూ పటాన్చెరును క్రీడా రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. క్రీడలు, క్రీడాకారులకు తన సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సైతం ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
రాష్ట్రస్థాయి క్రీడలకు పోలీసుల బందోబస్తు ఏదీ?
రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల నిర్వహణకు తగిన పోలీసు బందోబస్తు కల్పించడంలో పటాన్చెరు పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు, కోచ్లు, నిర్వాహకులు హాజరయ్యే ఇలాంటి ప్రతిష్ఠాత్మక పోటీలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.
క్రీడా కార్యక్రమాల పట్ల పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. క్రీడాకారులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన సమయంలో బందోబస్తు విషయంలో నిర్లక్ష్యం వహించడం సరికాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీతో పాటు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో పోలీసు శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్..
రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు హాజరైన క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలను తన సొంత నిధులతో ఏర్పాటు చేయడం ద్వారా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్రీడల పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేపట్టారు.
పటాన్చెరులో క్రీడా మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేసి, స్థానిక క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల ప్రారంభంతో పటాన్చెరు మైత్రి మైదానం క్రీడా సందడితో కళకళలాడింది.
ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, పృథ్వీరాజ్, అశోక్, వెంకటేష్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.




