Pashamylaram: పాశమైలారంలో 10 ఎకరాల పార్క్ భూమిని పరిరక్షించాలి!

Pashamylaram: పాశమైలారంలోని 10 ఎకరాల TGIIC హరితహారం పార్క్ భూమి ఆక్రమణలపై ప్రజావాణిలో ఫిర్యాదు. సమగ్ర సర్వే చేసి భూమిని కాపాడాలని నిజాముద్దీన్ బాబా విజ్ఞప్తి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Nov 2026 1:39 PM IST
Pashamylaram
X

Pashamylaram: పాశమైలారంలో 10 ఎకరాల పార్క్ భూమిని పరిరక్షించాలి!

Pashamylaram: పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని 10 ఎకరాల TGIIC హరితహారం పార్క్ భూమిని పరిరక్షించాలని కోరుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ నిజాముద్దీన్ బాబా జిల్లా స్థాయి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

2015లో తెలంగాణ హరితహారం కార్యక్రమం ప్రారంభమైన సమయంలో పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో 10 ఎకరాల భూమిని పార్క్ కోసం కేటాయించారు. ఈ ప్రదేశంలో అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రస్తుతం పార్క్ భూమిలో కొంత భాగం ఆక్రమణకు గురైనట్లు, అలాగే పార్క్ భూమి మీదుగా రహదారి నిర్మాణం జరిగినట్లు పేర్కొంటూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని నిజాముద్దీన్ బాబా కోరారు.

పార్క్ భూమికి సంబంధించిన సర్వే నంబర్లు, విస్తీర్ణం, హద్దులు, TGIIC ఆమోదించిన లేఅవుట్ తదితర రికార్డులను పరిశీలించి, రెవెన్యూ మరియు TGIIC అధికారులతో సంయుక్త సర్వే నిర్వహించాలని ప్రజావాణి ద్వారా కోరారు.

అనధికార ఆక్రమణ లేదా రహదారి నిర్మాణం ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని, పార్క్ భూమిని ప్రజా ప్రయోజనం కోసం పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఆక్రమణలకు అవకాశం లేకుండా పార్క్ భూమికి స్పష్టమైన హద్దులు, సర్వే రాళ్లు మరియు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్