Sangareddy: ఇస్నాపూర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన నీలం మధు!
Sangareddy: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నీలం మధు ముదిరాజ్ ప్రారంభించారు.
Sangareddy: ఇస్నాపూర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన నీలం మధు!
Sangareddy: చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.
ఆదివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు రెండు చుక్కల ఓరల్ పోలియో వ్యాక్సిన్ (బీఓపీవీ) అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా చిన్నారులకు వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలంటే ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు.
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం రాష్ట్రంలోని తల్లిదండ్రులు బాధ్యతగా భావించాలని కోరారు. పిల్లల ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధే రేపటి సమాజానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకూడదని, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అర్హులైన పిల్లలకు వ్యాక్సిన్ అందించాలని సూచించారు.
ప్రజాప్రభుత్వం చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నీలం మధు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు గోపాల్, దస్తగిరి, నాయకులు అనిల్, శ్రీనివాస్, వైద్య సిబ్బంది, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.




