Narsapur: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు - శాస్త్రవేత్తలు

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వరి విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

G Ashok Reddy, Narsapur
Published on: 17 Nov 2026 8:17 PM IST
Narsapur
X

Narsapur: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు - శాస్త్రవేత్తలు

నర్సాపూర్: నాణ్యమైన విత్తనాల వినియోగంతోనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నాబార్డు అధికారులు పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన వరి విత్తనాలను అందించడంతోపాటు, విత్తనోత్పత్తి పద్ధతులపై అవగాహన కల్పించే లక్ష్యంతో నర్సాపూర్ మండలంలో క్షేత్ర ప్రదర్శన, రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.

తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, మెదక్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమం పీజేటీఎస్ఏయూ–నాబార్డ్–ఏపీసీఎస్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టారు. ఇందులో భాగంగా KNM-1638 వరి విత్తనోత్పత్తిపై రైతులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి. సతీష్ మాట్లాడుతూ.. వరి విత్తనాల నాణ్యతను కాపాడుకోవడానికి రైతులు పంట కోత నుంచి విత్తనాల నిల్వ వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విత్తనాలను నిల్వ చేసే ముందు తేమ శాతం 8 నుంచి 10 శాతం మధ్య ఉండేలా ఆరబెట్టుకోవాలని తెలిపారు.

అలాగే గిడ్డంగుల్లో నిల్వ చేసిన విత్తనాల మొలక శాతాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని, విత్తనాల నాణ్యత దెబ్బతినకుండా గిడ్డంగుల్లో అవసరమైన యాజమాన్య పద్ధతులు పాటించాలని వివరించారు. గిడ్డంగుల్లో మలాథియాన్ ద్రావణాన్ని 10 శాతం మోతాదులో పిచికారీ చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా నర్సాపూర్ శాస్త్రవేత్త సిద్ధమ్మ, నాబార్డు మేనేజర్ కృష్ణతేజ మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. రైతులు శాస్త్రీయ పద్ధతులను అవలంబించి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రాజు యాదవ్, వెంకటస్వామి, మధు, సాయికిరణ్, సునీల్, ఎఫ్‌సీఐ మేనేజర్‌తో పాటు దాదాపు 50 మంది రైతులు పాల్గొన్నారు...

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur