Narsapur: నర్సాపూర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో వాడీవేడీ చర్చలు

Narsapur: నర్సాపూర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం వాడీవేడీగా సాగింది. అభివృద్ధి పనులు, రింగ్‌రోడ్ మార్కింగ్, అక్రమ వెంచర్లపై కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు.

G Ashok Reddy, Narsapur
Published on: 30 Sept 2026 5:25 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో వాడీవేడీ చర్చలు

నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య (జనరల్ బాడీ) సమావేశం వాడీవేడీ చర్చలకు వేదికగా మారింది. పట్టణంలో తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, రోడ్లు, వెంచర్లు, మార్కెట్ తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు అధికారులను ప్రశ్నించారు. సమావేశానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరై పట్టణ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు.

మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనుల తీరుపై కౌన్సిలర్లు ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్ల వార్డుల్లో అభివృద్ధి పనులు శూన్యంగా ఉన్నాయని, అధికార పార్టీ కౌన్సిలర్ల వార్డులకే అభివృద్ధి పనులు పరిమితమవుతున్నాయంటూ కొందరు కౌన్సిలర్లు సమావేశంలో తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వార్డులన్నింటినీ సమానంగా పరిగణించి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.

‘షుగర్ ఫ్యాక్టరీ వద్ద సీసీ రోడ్డు ఎవరికి ఉపయోగం?’

మెదక్ రోడ్డులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిర్మిస్తున్న సీసీ రోడ్డు విషయంలోనూ కౌన్సిలర్లు ప్రశ్నలు సంధించారు. ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడే ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారో స్పష్టత ఇవ్వాలని కోరుతూ.. “ప్రజా అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇలాంటి పనులు చేపట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి?” అంటూ ప్రశ్నించారు.

నిబంధనలు పాటించకుండా వెంచర్లు.. కమిషనర్‌ను నిలదీసిన కౌన్సిలర్లు

నర్సాపూర్ పట్టణ పరిధిలో అనుమతులు లేకుండా వెంచర్లు కొనసాగుతున్నాయంటూ కౌన్సిలర్లు మరో కీలక అంశాన్ని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నించారు. అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలు, వెంచర్లపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.

‘అండర్‌గ్రౌండ్ డ్రైనేజీపై దృష్టి పెట్టాలి’

నర్సాపూర్ పట్టణంలో పూర్తిస్థాయి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అధికారులకు సూచించారు. పట్టణ పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.

ఇంతకు ముందు మార్కింగ్ చేసిన రింగ్‌రోడ్ పై ప్రజాప్రతినిధుల ఆందోళన వక్తం చేసారు. మార్కింగ్ ని వెంటనే తొలగించే విదంగా చర్యలు తీసుకోవాలని దాని వలన అక్కడున్న ప్రజలకి పలు ఇబ్బందులు ఎదురుకొంటున్నారని అసహనం వక్తం చేసారు...

నర్సాపూర్ పట్టణ రింగ్‌రోడ్ మార్కింగ్ సమస్యను కూడా కౌన్సిలర్లు ఎమ్మెల్యే సునీతారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే మున్సిపల్ నిధులు, ఎజెండా రూపకల్పన అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. తమకు సమాచారం లేకుండా ఎజెండాలో అంశాలను ఎలా చేర్చారని కౌన్సిలర్లు కమిషనర్‌ను ప్రశ్నించారు. ఈ అంశంపై ఎమ్మెల్యే సునీతారెడ్డి కూడా అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

కూరగాయల మార్కెట్‌కు శాశ్వత పరిష్కారం

నర్సాపూర్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కౌన్సిలర్లు కోరారు. వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా మార్కెట్ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

వీధి కుక్కలు, కోతుల నివారణకు రూ.2 లక్షలు

పట్టణంలో వీధి కుక్కలు, కోతుల బెడద నివారణకు రూ.2 లక్షలు కేటాయిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ వాహనాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్‌ను కూడా కేటాయించారు.

252 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తి

నర్సాపూర్ పట్టణంలో నిర్మించిన 252 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తయినట్లు ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. త్వరలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించే ప్రక్రియ చేపడతామని ఆమె వెల్లడించారు.

పట్టణ అభివృద్ధిలో ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వార్డుల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, మున్సిపల్ చైర్మన్ లక్ష్మి యాదవ్, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ మున్సిపల్ కమిషనర్ సాయికుమార్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur