Narsapur: సిద్దిపేట సభకు 5 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు
Narsapur: ఈ నెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు నర్సాపూర్ నుంచి 5 వేల మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
Narsapur: సిద్దిపేట సభకు 5 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు
నర్సాపూర్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొననున్న ఈ సభకు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట సభ వేదికగా మరో కీలక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టనుందని తెలిపారు. కుటుంబంలో అనుకోని పరిస్థితుల్లో సభ్యులు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించే *'ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని'* ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా మహిళలకు చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి సభా వేదికగా ప్రజలకు వివరించనున్నారని తెలిపారు.
ఈ భారీ బహిరంగ సభకు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సుమారు 5 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయకులు వెల్లడించారు. ఈ నెల 19న సాయంత్రం 4 గంటలలోపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సిద్దిపేటకు చేరుకోవాలని సూచించారు.
నర్సాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆంజనేయులు గౌడ్, రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి రాజు యాదవ్, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




